పీవోకేలో తిరుగుబాటు..30 మంది మృతి..వేలమందికి గాయాలు
ఎన్నాళ్లుగానో పొరుగు దేశాల్లో అస్థిరతను సృష్టించాలని చూస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన పాకిస్తాన్‌కు ఇప్పుడు అసలైన ముప్పు సొంత ఇంటి నుంచే ఎదురవుతోంది.
By: A.N.Kumar | 9 Jun 2026 6:47 PM ISTఎన్నాళ్లుగానో పొరుగు దేశాల్లో అస్థిరతను సృష్టించాలని చూస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన పాకిస్తాన్‌కు ఇప్పుడు అసలైన ముప్పు సొంత ఇంటి నుంచే ఎదురవుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పరిస్థితులు రోజురోజుకూ చేజారిపోతున్నాయి. తీవ్రమైన ఆర్థిక కష్టాలు, ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ రాజకీయ అనిశ్చితిపై అక్కడి ప్రజల ఆగ్రహం ఒక్కసారిగా వీధుల్లోకి పొంగిపొర్లింది. ఇన్నాళ్లూ అణచివేతకు గురైన జనం.. ఇప్పుడు తమ హక్కుల కోసం ఏకంగా పాక్ ప్రభుత్వానికే సవాలు విసురుతున్నారు.
ఉద్రిక్తంగా మారిన జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ నిరసనలు
పీవోకేలో హక్కుల సాధన కోసం జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు భారీ ఉద్రిక్తతలకు దారితీశాయి. గోధుమ పిండిపై సబ్సిడీలు ఇవ్వాలని.. విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు, వ్యాపారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అయితే ఈ శాంతియుత నిరసనలను అణచివేయడానికి పాక్ ప్రభుత్వం భద్రతా బలగాలను రంగంలోకి దించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.
నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణలు కాల్పుల వరకు వెళ్లడంతో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మరో 200 మందికి పైగా గాయపడినట్లు స్థానిక సమాచారం ద్వారా తెలుస్తోంది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుండటంతో పీవోకే అంతటా మొబైల్, ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు.
పాలకుల ద్వంద్వ నీతి.. ప్రపంచానికి పాఠాలు.. ఇంట్లో అణచివేతలు..
ఇక్కడే పాకిస్తాన్ పాలకుల అసలు రంగు బయటపడుతోంది. ఇతర దేశాల్లో ప్రజలు రోడ్లపైకి వస్తే అది ప్రజాస్వామ్య హక్కు అంటూ అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలు దంచే ఇస్లామాబాద్ నాయకులు తమ సొంత పాలనలోని ప్రజలు ప్రశ్నిస్తే మాత్రం తుపాకులతో సమాధానం చెబుతున్నారు. "రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. అంతా సవ్యంగా సాగుతోంది" అని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం భయానక వాతావరణం నెలకొంది. వీధుల్లో ఆర్మీ, రేంజర్స్ బలగాలు మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
పరస్పర ఆరోపణలు.. అసలు నిజం ఏమిటి?
పోలీసుల వాదన ప్రకారం.. నిరసనకారులే తొలుత శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని.. భద్రతా సిబ్బందిపై పెట్రో బాంబులతో దాడులు చేసి, కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు. కానీ స్థానిక వర్గాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ వాదనను కొట్టిపారేస్తున్నాయి. దశాబ్దాలుగా పీవోకే వనరులను దోచుకుంటూ స్థానికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేయడమే ప్రజల ఆగ్రహానికి అసలు కారణమని వారు స్పష్టం చేస్తున్నారు.
ఆర్థిక సంక్షోభంలో మునిగిన పాక్‌కు కోలుకోలేని దెబ్బ
ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి అప్పుల కోసం దేవులాడుతూ, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కుదేలైన పాకిస్తాన్‌కు పీవోకే పరిణామాలు మింగుడుపడటం లేదు. ఒకవైపు దేశీయంగా ద్రవ్యోల్బణం, మరోవైపు రాజకీయ కుమ్ములాటలతో సతమతమవుతున్న ఇస్లామాబాద్ ప్రభుత్వానికి ఈ ప్రజా తిరుగుబాటు పెద్ద సవాలుగా మారింది.
పొరుగువారికి సలహాలు ఇవ్వడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం సులభమే కానీ.. సొంత ఇంట్లో మంటలు చెలరేగితే వాటిని ఆర్పడం అంత తేలిక కాదని ఈ పరిణామాలు పాకిస్తాన్‌కు గట్టిగా గుర్తుచేస్తున్నాయి. ప్రస్తుతం పీవోకేలో బూడిద కుప్ప కింద నిప్పులా ఉన్న ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చి, ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఒక అగ్నిపరీక్షే అని చెప్పాలి.
