Begin typing your search above and press return to search.

పోచారంపై సెంటిమెంటు దెబ్బ ?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో పోటీచేస్తున్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై సెంటిమెంట్ దెబ్బపడటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   17 Nov 2023 5:28 AM GMT
పోచారంపై సెంటిమెంటు దెబ్బ ?
X

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో పోటీచేస్తున్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై సెంటిమెంట్ దెబ్బపడటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. దాంతో స్పీకర్ గెలుపుపై చాలామంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఉమ్మడి రాష్ట్రమైనా, ప్రత్యేక తెలంగాణా అయినా ఒక బలమైన సెంటిమెంటు నడుస్తోంది. అదేమిటంటే స్పీకర్ గా పనిచేసిన వాళ్ళు ఆ తర్వాత ఎన్నికల్లో గెలవలేదట. కేయార్ సురేష్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ ఓడిపోయారు.

చివరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి స్పీకర్ గా పనిచేసిన మధుసూదనా చారి కూడా ఓడిపోయారు. దాంతో స్పీకర్ గా పనిచేసిన వారు తర్వాత ఎన్నికల్లో గెలువరు అనే సెంటిమెంటుపై బలమైన చర్చ జరుగుతోంది. బాన్సువాడ నుండి పోచారం వరుసగా ఎనిమిదిసార్లు పోటీచేశారు. ఒకే ఒక్కసారి బాజిరెడ్డి గోవర్ధనరెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే తర్వాత ఎన్నికల్ల గెలిచారు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో గెలుస్తారా లేకపోతే ఓడుతారా అనే చర్చ పెరిగిపోతోంది.

ఈ సెంటిమెంటును దృష్టిలో పెట్టుకునే పోచారం కూడా స్పీకర్ పదవిని తీసుకోవటానికి ఇష్టపడలేదట. అయితే కేసీయార్ బలవంతంచేసి పోచారంను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇపుడిదే పోచారంకు పెద్ద మైనస్ అయిపోయింది. ఒకవైపు సెంటిమెంటు పోచారంను భయపెడుతుంటే మరోవైపు ఇద్దరు ప్రత్యర్ధులు కూడా ఊపిరి ఆనీయటంలేదు. పోచారంకు ప్రత్యర్ధిగా కాంగ్రెస్ తరపున నాలుగుసార్లు గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అలాగే బీజేపీ తరపున ఐదుసార్లు పోటీచేసి రెండుసార్లు గెలిచిన యెండల లక్ష్మీనారాయణ పోటీచేస్తున్నారు. వీళ్ళిద్దరు పోచారంకు ఊపిరి కూడా ఆయనీయకుండా ప్రచారం చేస్తున్నారు.

పార్టీపైన అలాగే ప్రభుత్వంపైన జనాల్లో వ్యతిరేకత పోచారంను బాగా ఇబ్బంది పెడుతోంది. పోయిన ఎన్నికల వరకు పోచారంపై పోటీచేసిన నేతలు ద్వితీయ శ్రేణి నేతలే అవటంతో పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. కానీ ఇపుడు మాత్రం గట్టి ప్రత్యర్ధులు ఎదురవ్వటంతో సమస్యలు పెరిగిపోతున్నాయి. పథకాల అమలులో పోచారం బాగానే కష్టపడ్డారని జనాలు చెప్పుకుంటున్నారు. అయితే వివిధ కారణాల రీత్యా తన కొడుక్కి టికెట్ ఇవ్వమంటే కేసీయార్ అంగీకరించలేదు. అందుకని పోటీలోకి దిగిన పోచారం ఇపుడు నానా అవస్తలు పడుతున్నారు.