Begin typing your search above and press return to search.

ఎర్రకోటపై మువ్వన్నెల రెపరెపలు... గర్జించిన ప్రధాని!

నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌ తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలు.

By:  Tupaki Desk   |   15 Aug 2023 5:13 AM GMT
ఎర్రకోటపై మువ్వన్నెల రెపరెపలు... గర్జించిన ప్రధాని!
X

యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌ తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

అవును... తొలుత రాజ్‌ ఘాట్‌ లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని.. ఆ తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం భారతీయులకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మోడీ చెప్పారు.

మణిపూర్ ప్రజలకు అండగా:

ఈ సందర్భంగా మణిపూర్‌ లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల పట్ల స్పందించారు. మణిపూర్‌ లో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోన్నట్లు చెప్పారు. యావత్ దేశం మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని.. ప్రధాని భరోసా ఇచ్చారు. శాంతి ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.ఈ సందర్భంగా... మణిపూర్ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తోన్నాయని చెప్పడం గమనార్హం.

కొత్త పార్లమెంట్ భవనం:

ఇదే సమయంలో... తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవ భారత నిర్మాణం జరుగుతోందని చెప్పిన మోడీ.. తాము అధికారంలోకి వచ్చాక గడువు కంటే ముందే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని అన్నారు.

అనంతరం... ఇది మోడీ ప్రభుత్వం అని, ఆత్మనిర్భర్ భారత్‌ కు ప్రతీక అని మోడీ పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. దాన్ని అనుకున్న సమయం కంటే ముందే ఛేదించడమూ తమకు తెలుసునని చెప్పుకొచ్చారు. జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం.. అనే ఈ మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని మోడీ చెప్పారు.

ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు:

ఇదే సమయంలో ఈ సారి ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేశాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఊహకందని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ కష్టకాలంలో బాధితులకు దేశ ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలకు మోడీ సానుభూతిని తెలియజేశారు.

మెరుగైన ఆర్ధిక వ్యవస్థ:

2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి కుంభకోణాలు రాజ్యమేలుతున్నాయని చెప్పిన మోడీ... అప్పటికి ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉందని అన్నారు. ఆ తర్వాత బలమైన ఆర్థిక విధానాలు, పారదర్శక పాలన దేశానికి కొత్త శక్తినిచ్చాయని తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వ పథకాల్లోని లోపాలను అరికట్టినట్లు ప్రధాని చెప్పారు.

ఇదే సమయంలో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ది 10వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు అయిదో స్థానానికి చేరుకున్నామని ప్రధాని మోడీ అన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయంటూ ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

జల్ శక్తి ఓ ఉదాహరణ:

సత్తాచాటు, మార్పు చెందు అన్న పద్ధతిలో దేశం ముందడుగు వేస్తోంది.. ప్రతి సంస్కరణలోనూ ఓ పరమార్థం ఉంది.. సంస్కరణలకు జల్‌ శక్తి శాఖ ఓ ఉదాహరణ.. పర్యావరణహితంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నాం.. బలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే సంస్కరణలు సాధ్యమని మోడీ తెలిపారు.

కరోనా తర్వాత భారత్:

కరోనా తర్వాత భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని మోడీ అన్నారు. కొత్త ప్రపంచంలో మన దేశాన్ని విస్మరించడం ఎవరి తరమూ కాదని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచంలో భారత్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని తెలిపారు. ఇదే సమయంలో మన ఎగుమతులు కొత్త లక్ష్యాలను చేరుకుంటున్నాయని ప్రకటించారు.

శాటిలైట్‌ రంగంలో దూసుకుపోతున్నాం:

ఈ పదేళ్లలో భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని చెప్పిన మోడీ... శాటిలైట్‌ రంగంలో దూసుకుపోతున్నామని.. రాబోయే కాలాన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాసిస్తోందని అన్నారు. 30 ఏళ్ల లోపు యువతే భారత్‌ కు దిశానిర్దేశం చేయాలని సూచించారు. సాంకేతికంగానే కాదు వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

ఇదే సమయంలో టెక్నాలజీ విషయంలో భారత్‌ ఎంతో మెరుగుపడి డిజిటల్‌ ఇండియా దిశగా భారత్‌ దూసుకెళ్తోన్నట్లు తెలిపారు. అలాగే సాంకేతికంగా స్టార్టప్స్‌ రంగంలో భారత్‌ టాప్‌-3లో ఉందని ప్రకటించారు. ఇక ఈ ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక జీ-20 సమావేశానికి ఆతిధ్యమిచే అరుదైన అవకాశం భారత్‌ కు లభించిందని మోడీ అన్నారు.

అమెరికా, చైనా తర్వాత భారత్:

వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని మోడీ అన్నారు. మారుమూల గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించామని.. దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్‌ ను అందుబాలోకి తీసుకువచ్చామని ప్రధాని ప్రకటించారు.

అనంతరం... ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత దేశమే ఉంటుందని, భారత్‌ అభివృద్ధిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ ప్రధాని ప్రసంగాన్ని ముగించారు.