ఈయన ఎన్ని కష్టాలు పడ్డారో.. రఘురామ గురించి మోడీ!
అయితే.. ఈ సమయంలో ముగ్గురు నాయకుల విషయంలో మోడీ ఆసక్తిగా స్పందించారు.
By: Tupaki Desk | 2 May 2025 3:45 PMఏపీ రాజధాని అమరావతిలో పనులను పునః ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. తిరిగి వెళ్తున్న సమ యంలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయన అమరావతిలో ప్రసంగాన్ని, కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన వెంట సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఎంపీలు బాలశౌరి, ఆర్. కృష్ణయ్య సహా పలువురు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. మోడీ ఢిల్లీకి తిరిగి వెళ్తున్న క్రమంలో లైన్‌లో నిలబడి ఆయనకు అభినందనలు తెలుపుతూ.. వీడ్కోలు పలికారు.
అయితే.. ఈ సమయంలో ముగ్గురు నాయకుల విషయంలో మోడీ ఆసక్తిగా స్పందించారు. వారు చంద్రబాబుకు తెలిసిన నేతలే అయినా.. వారి దగ్గరకు రాగానే.. వారి చేతులు పట్టుకుని చంద్రబాబుకు చూపిస్తూ.. ''వీరు మీకు తెలుసా?'' అంటూ.. ఆ ముగ్గురు నేతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిలో డిప్యూటీ స్పీకర్ రఘురామ గురించి రెండు నిమిషాలకు పైగానే.. మోడీ ఆయన దగ్గరనిలబడి చంద్రబాబుకు కొన్ని విషయాలు చెప్పారు. ''ఈయన మీకు తెలుసా? చాలా కష్టాలు పడ్డారు. ఎంతో మంచి వ్యక్తి. అభివృద్ది, దేశం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈయనకు గతంలో అన్యాయం జరిగింది. నన్ను చాలా కలచివేసింది. '' అని మోడీ వ్యాఖ్యానించారు.
కాగా.. రఘురామ గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు.. ఆయనపై కేసు పెట్టి.. సీఐడీ పోలీసులు నిర్బంధించారు. ఆయనను కస్టడీలో టార్చర్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ఈ విషయాన్నే పరోక్షంగా ఉటంకిస్తూ.. ప్రధాని.. సీఎం చంద్రబాబుతో పంచుకోవడం గమనార్హం. అదేవిధంగా.. మచిలీపట్నం ఎంపీ, జనసేన నాయకుడు బాలశౌరి వద్దకు వచ్చిన ప్రధాని.. ఆయన భుజంపై చేయి వేసి.. ''ఈయన చాలా మంచి వాడు'' అని చంద్రబాబుకు పరిచయం చేశారు. ఎంతో కష్టపడతా రని.. రాష్ట్ర ప్రాజెక్టుల కోసం తన దగ్గరకు రెండు సార్లు వచ్చారని చెప్పుకొచ్చారు. ఇక్కడ కూడా దాదాపు నిమిషం పాటు ప్రధాని టైం స్పెండ్ చేయడం గమనార్హం.
ఇక, మూడో నాయకుడు.. ఆర్. కృష్ణయ్య. ఈయన భుజంపైనా చేయి వేసిన మోడీ.. చంద్రబాబుకు పరిచయం చేస్తూ.. ''బీసీల కోసం ఈయన త్యాగాలు చేశారు. చాలా మంది నాయకుడు. ఈయన వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తనకు ఎప్పటి నుంచో ఆర్ . కృష్ణయ్య తెలుసునని మోడీ చెప్పారు. గతంలో గుజరాత్‌కు ఒకసారి వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు. ఇలా.. విమానాశ్రయంలో తనకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన వారిలో ఎంతో మంది ఉన్నా.. ఈ ముగ్గురిని మాత్రం మోడీ చాలా ఆప్యాయంగా పలకరించి.. వారి గురించి అన్నీ తెలిసిన చంద్రబాబుకు పలు విషయాలు వివరించడం గమనార్హం.