గ్రేట్ సర్‌ప్రైజ్ : ఏపీ CM చంద్రబాబు- డిప్యూటీ CM పవన్ ఇళ్లలో PM మోదీ సందడి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ప్రధాని పర్యటన అత్యంత సాదాసీదాగా, ఆత్మీయంగా సాగింది.
By: Sivaji Kontham | 11 May 2026 10:00 AM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన, అరుదైన ఘట్టం. భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఉపముఖ్యమంత్రి ఇళ్లకు విచ్చేసి.. వారి కుటుంబ సభ్యులతో సమయం గడపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ప్రధాని పర్యటనలు అత్యంత అధికారికంగా.. ప్రోటోకాల్‌తో కూడి ఉంటాయి. కానీ ఆదివారం నాడు హైదరాబాద్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి.. అలాగే పవన్ కళ్యాణ్ ఇంటికి పీఎం మోదీ నేరుగా వెళ్లడం ఒక `నెవ్వర్ బిఫోర్` సీన్‌ను ఆవిష్కరించింది. కేవలం రాజకీయ నేతలుగానే కాకుండా, ఆత్మీయ మిత్రులుగా వారి కుటుంబాలతో మోదీ ముచ్చటించడం విశేషం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ప్రధాని పర్యటన అత్యంత సాదాసీదాగా, ఆత్మీయంగా సాగింది. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి మోదీ ఫోటోలు దిగడమే కాకుండా వారితో సరదాగా సంభాషించారు. ముఖ్యంగా యువనాయకుడు నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ చేతుల మీదుగా మోదీ శ్రీ వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని, ఒక అరుదైన కానుకను అందుకోవడం ఆసక్తికరం. పీఎంతో ఫోటోఫ్రేమ్ లో సిఎన్‌బి- నారా భువనేశ్వరి దంపతులు, నారా లోకేష్ నాయుడు- నారా బ్రాహ్మణి దంపతులు, మాస్టర్ దేవాన్ష్ ఉన్నారు. ప్రపంచ యవనికపై ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా నీరాజనాలు అందుకుంటున్న ప్రధాని ఇలా ఒక ఇంటి సభ్యుడిలా కలిసిపోవడం అక్కడున్న వారందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో `ఐటీ ఫోటో బ్లాగ్` పేరుతో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఏపీ సీఎం నివాసంలో ఈ భేటీ జరగడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
మరోవైపు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రధాని మోదీ పర్యటన ఎంతో భావోద్వేగభరితంగా సాగింది. దీనిపై పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని షేర్ చేసారు. ``మా నివాసంలోకి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించడం మా కుటుంబం ఎన్నటికీ మరచిపోలేని గౌరవం`` అని శ్రీమతి అన్నా కొణిదెల పేర్కొన్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి తమ ఇంటికి వచ్చినప్పుడు ఆయన చూపించిన ఆత్మీయత, పద్ధతి తమ హృదయాలను గెలుచుకున్నాయని వెల్లడించారు. ఈ పర్యటనలో రాజకీయాల కంటే మానవీయ సంబంధాలే ఎక్కువగా కనిపించాయని అన్నా లెజినోవా అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ నివాసంలో మోదీ పిల్లలతో గడిపిన సమయం చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కుమారులు, కుమార్తెలు ఉన్నారు. అక్కడున్న పిల్లలందరితో వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రధాని వారి ఆసక్తులు ఏమిటి? భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఒక దేశాధినేత అంతటి నిశితమైన శ్రద్ధ చూపడం అరుదైన విషయమని కుటుంబ సభ్యులు కొనియాడారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి కూడా మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముందు ఆరోగ్యంపై దృష్టి సారించి... ఆ తర్వాతే పనిలోకి రావాలి! అని పవన్ కళ్యాణ్‌కు ప్రధాని సూచించడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది.
ప్రధాని మోదీ ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ భార్యతో సరదాగా మాట్లాడుతూ.. ``ఆయన్ని బాగా చూసుకోండి`` అని చిరునవ్వుతో చెప్పడం ఆత్మీయతకు పరాకాష్టగా నిలిచింది. దానికి శ్రీమతి అన్నా లెజినోవా స్పందిస్తూ ``నేను ఇప్పటికే ఆ పనిని చాలా సంతోషంగా చేస్తున్నాను`` అని బదులిచ్చారు. ఈ మొత్తం సందర్శనలో ఒక ప్రధాని కంటే ఒక పెద్ద దిక్కులా మోదీ వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరి మనసు గెలుచుకుంది. అధికారిక హోదాలను పక్కన పెట్టి కేవలం మానవీయ కోణంలో సాగిన ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.
