మళ్లీ ఏపీకి వస్తున్న ప్రధాని.. ఎప్పుడంటే?
అమరావతి సభలోనే తన రాకపై సంకేతాలిచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీ వెళ్లగానే ఏపీ టూర్ పై డేట్ ఫిక్స్ చేశారు.
By: Tupaki Desk | 5 May 2025 5:25 AMప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ఏపీలో పర్యటించనున్నారు. ఈ నెల 2న అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీ నెల రోజుల్లోనే రెండోసారి రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత చూపడం విశేషం. అమరావతి సభలోనే తన రాకపై సంకేతాలిచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీ వెళ్లగానే ఏపీ టూర్ పై డేట్ ఫిక్స్ చేశారు.
అమరావతి కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్రం వరకు ప్రతి విషయంలోనూ ప్రధానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిని మళ్లీ ఆయన చేతుల మీదుగానే రీస్టార్ట్ చేయించారు.
ఇక ఆ రోజు సభా వేదికపైనే మరోసారి రాష్ట్రానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ వేదికగా ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. తన ఆలోచనను అమరావతి సభా వేదికపైనే ప్రధాని మోదీతో పంచుకోవడమే కాకుండా, విశాఖలో యోగా దినోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
చంద్రబాబు ఆహ్వానంపై అప్పటికప్పుడే ప్రధాని మోదీ స్పందించారు. తాను విశాఖ వచ్చేందుకు రెడీ అన్నారు. అయితే ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడినందున ప్రధాని పర్యటనపై సందేహాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం నాడే యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. కానీ, ప్రధాని మోదీ అమరావతికి వచ్చి పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఇక ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లిన వెంటనే జూన్ 21న నిర్వహించే యోగా దినోత్సవం రోజు తాను విశాఖ వచ్చేలా కార్యక్రమం రూపొందించాలని ప్రధాని మోదీ తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. దీంతో జూన్ 21న ప్రధాని మోదీ విశాఖ టూర్ ఖరారు చేస్తూ ప్రధాని కార్యాలయం నుంచి ప్రభుత్వానికి వర్తమానం అందింది. ఆ రోజు యోగా దినోత్సవంతోపాటు పలు కార్యక్రమాలు నిర్వహించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ప్రధాని రాక సందర్భంగా విశాఖ టూరిజం, అరకు కాఫీకి మరింత ప్రచారం తీసుకురావడంతోపాటు విశాఖలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఆంధ్రా వర్సిటీ శత వసంతోత్సవాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ప్రధాని మోదీ 3.0 సర్కారులో ఏపీకి విశేష ప్రాధాన్యం దక్కుతోందని అంటున్నారు.