టోక్యోలో ప్రధాని మోదీకి స్వాగతంలో ట్విస్ట్.. వీడియో వైరల్
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాన అంశం 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం.
By: Tupaki Desk | 29 Aug 2025 12:33 PM ISTభారత ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాన అంశం 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం. అయితే టోక్యోలో అడుగుపెట్టిన వెంటనే ప్రధానికి ఇచ్చిన స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా మారింది. గాయత్రి మంత్ర జపంతో ఆయనకు స్వాగతం పలకడం ఆ క్షణాన్ని మరింత విశిష్టంగా నిలిపింది. ఆ సందర్భానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారింది. వీడియోలో జపాన్ కళాకారులు మంత్రోచ్చారణ చేస్తుండగా, వారితో పాటు ప్రధాని మోదీ కూడా గాయత్రి మంత్రాన్ని పఠించడం విశేషంగా నిలిచింది.
ఆర్థిక సహకారం.. సాంకేతిక మార్పిడి
జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపట్టిన మోదీ, రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పించారు. వార్షిక శిఖరాగ్ర సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్య ఘట్టంగా భావించవచ్చు. ఇందులో ఆర్థిక సహకారం, సాంకేతిక మార్పిడి, భద్రతా అంశాలు, వాతావరణ మార్పులపై సంయుక్త చర్యలు వంటి కీలక అంశాలు చర్చకు రావచ్చని అంచనా. అదనంగా పలువురు జపాన్ వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ సమావేశమై పెట్టుబడులు, ఆర్థిక భాగస్వామ్యంపై చర్చించనున్నారు.
‘టోక్యోలో అడుగుపెట్టాను. భారత్-జపాన్ తమ అభివృద్ధి సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ పర్యటన ద్వారా కొత్త మార్గాలను అన్వేషించే అవకాశం దొరుకుతుంది’ అని ప్రధాని మోదీ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో వెల్లడించారు.
టోక్యోలో నివసిస్తున్న భారతీయ సమాజం అందించిన ఆత్మీయ స్వాగతాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. "మన సంస్కృతిని కాపాడుకుంటూనే, జపాన్‌లో సుస్థిరంగా స్థిరపడిన భారతీయులు నిజంగా ఆదర్శప్రాయులు" అని ఆయన ప్రశంసించారు.
జపాన్ పర్యటన పూర్తయ్యాక, ప్రధాని మోదీ చైనాకు వెళ్లనున్నారు. అక్కడ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని కీలక నాయకులతో భేటీ అవుతారు. ఈ రెండు పర్యటనల ద్వారా ఆసియాలో భారత వ్యూహాత్మక స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని మోదీ ప్రయత్నిస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, టోక్యోలో గాయత్రి మంత్ర జపంతో ప్రారంభమైన భారత ప్రధాని పర్యటన, అటు ఆధ్యాత్మికతతో పాటు ఇటు రాజనీతికి సరికొత్త రూపాన్ని తీసుకువచ్చినట్లు చెప్పవచ్చు.
