ఇంటా - బయటా.. శత్రుశేషం లేకుండా!!
ఈ క్రమంలో చేపడుతున్న 'ఆపరేషన్ కగర్' మావోయిస్టులను ఏరేస్తోంది. తాజాగా బుధవారం కూడా.. చత్తీస్‌గఢ్-తెలంగాణ అడవుల్లో కర్రెగుట్టలపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులను కేంద్రం ఏరేసింది.
By: Tupaki Desk | 7 May 2025 9:18 AMప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యూహాత్మక వ్యవహారాలను గమనిస్తే.. ఇంటా - బయటా కూడా.. ఆయన శత్రుశేషం లేకుండా చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో మోడీ ప్రభ వెలిగిపోతోంది. చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు మోడీకి పేరు.. భారత్‌కు శాంతి తీసుకువస్తున్నాయనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఇంట ఏం జరుగుతోంది?
దేశంలో మావోయిస్టుల ప్రభావం ఎంత ఉందన్నది అందరికీ తెలిసిందే. కీలకమైన 9 రాష్ట్రాల్లో మావోయిస్టుల జోరు.. ప్రజల బేజారు కంటిపై కునుకు పట్టకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో మూడో సారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. 2026 జనవరి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించారు. దీనిని ఆయన అంతర్గత శత్రువులు అని అభివర్ణించినా.. మావోయిస్టులపై ఉక్కు పాదం మోపుతున్నారు.
ఈ క్రమంలో చేపడుతున్న 'ఆపరేషన్ కగర్' మావోయిస్టులను ఏరేస్తోంది. తాజాగా బుధవారం కూడా.. చత్తీస్‌గఢ్-తెలంగాణ అడవుల్లో కర్రెగుట్టలపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులను కేంద్రం ఏరేసింది. ఈ ఆపరేషనే కీలకమని అధికారులు, భద్రతా దళాలు కూడా చెబుతున్నాయి. దీంతో ఇంట కంట్లో నలుసుగా మారిన మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
బయట ఏం జరుగుతోంది?
బాహ్య ప్రపంచానికి వస్తే.. రెండు రకాల వ్యూహాలతో ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారు. ప్రపంచ దేశాలను ఏకం చేసి భారత్‌వైపు మళ్లించేందుకు ఒక అడుగు వేస్తుంటే.. మరోవైపు కంటగింపుగా ఉన్న పాక్, చైనాలకు సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్పేందుకు తన చతురతను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన సిందూర్ దాడి. దీనికి పాక్ మిత్రదేశమైన చైనా కూడా నోరు ఎత్తలేని పరిస్థితి వచ్చిందంటే.. మోడీ చేసిన ప్రపంచ స్థాయి వ్యూహమేనని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. సో.. ఎలా చూసుకున్నా ఇంటా -బయటా కూడా.. మోడీ ప్రభ వెలిగిపోతోందనడంలో సందేహం లేదు.