Begin typing your search above and press return to search.

ఇలాంటివి ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే చేయగలరు

అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి క్షణం తీరిక ఉండదు. వారు చేయాల్సిన పనుల జాబితాకు ముగింపు ఉండదు.

By:  Tupaki Desk   |   15 April 2025 10:39 AM IST
PM Modi Gifts Shoes to Devoted Supporter Who Walked Barefoot
X

అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి క్షణం తీరిక ఉండదు. వారు చేయాల్సిన పనుల జాబితాకు ముగింపు ఉండదు. అలాంటి వాటి విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. ముఖ్యమంత్రులకు సైతం ఆయన అపాయింట్ మెంట్ చాలా కష్టంగా లభిస్తుంది. అంత బిజీగా ఉన్న ఆయన.. కొన్నిసార్లు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేతలు కూడా చేయని పనుల్ని చేసి అందరిని ఆశ్చర్యపరుస్తారు. మోడీనా మజాకానా? అనేలా చేస్తారు. ఇంతకూ తాజాగా ఆయన చేసి పనేమంటారా? అక్కడికే వస్తున్నాం.

ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోడీ ఉండాలన్న స్వప్నాన్ని కంటూ పద్నాలుగేళ్లు కాళ్లకు చెప్పుల్లేకుండా తిరిగిన ఒక అభిమాని గురించి తెలుసుకోవటమే కాదు.. అతడ్ని పిలిపించి.. స్వయంగా కాళ్లకు బూట్లను తొడిగిన వైనం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. అదే సమయంలో.. సదరు అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు. మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత.. తాను ఆయన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ప్రతినబూనిన అభిమాని కలను నెరవేర్చారు.

హర్యానాకు చెందిన రామ్ పాల్ కశ్యప్ అనే అభిమాని ఇన్నాళ్లు కాళ్లకు చెప్పుల్లేకుండానే తిరిగేవాడు. అతడి గురించి తెలిసిన మోడీ అతడ్ని పిలిపించారు. అతడికి షూస్ ను బహుమతిగా అందజేశారు. తానే స్వయంగా కాలికి తొడిగి.. అందరి మనసుల్ని దోచుకున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మోడీని కలిసేందుకు కాళ్లకు చెప్పుల్లేకుండా వచ్చిన అభిమానిని.. ప్రధానమంత్రి పలుకరించటం.. ఎన్నేళ్లుగా కాళ్లకు చెప్పుల్లేకుండా నడిచారన్న ప్రశ్నను అడగటం కనిపిస్తుంది.

మిమ్మల్ని మీరు ఎందుకింతలా ఇబ్బంది పెట్టుకున్నారన్న ప్రశ్నను సంధించిన మోడీ.. ఇకపై ఎప్పుడూ అలా చేయొద్దని హామీ తీసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ స్పందిస్తూ.. ఇలాంటి వ్యక్తుల అప్యాయత.. ప్రేమను అంగీకరిస్తానని.. అలాంటి శపధాలు చేయొద్దన్నారు. ‘ఇలా చేసే ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నా. మీ ప్రేమను గౌరవిస్తా. దయచేసి సామాజిక క్రషి.. దేశ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై ఫోకస్ చేయండి’ అంటూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. చెప్పుల్లేకుండా తన వద్దకు వచ్చిన కశ్యప్ కు స్వాగతం పలికిన మోడీ.. ఒక సోఫాలో కూర్చున్న తర్వాత.. అతడ్ని కొన్ని ప్రశ్నలు అడగటం.. అనంతరం బూడిద రంగులో ఉన్న స్పోర్ట్స్ షూ అతడికి అందజేయటమేకాదు.. స్వయంగా తొడగటం కనిపిస్తుంది. అయితే.. భవిష్యత్తులో అలా చేయొద్దని అభిమాని నుంచి మాట తీసుకోవటంతో వీడియో ముగిసింది. ఇలాంటివి ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యమవుతాయని చెప్పక తప్పదు.