Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోదీ ప్ర‌చారం చేస్తున్న ఈ 'జొన్న‌ రొట్టె' తిన్నారంటే వ‌దిలిపెట్ట‌రు!

స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం- దేశీ ఆహారాన్ని ప్రజలకు చేరవేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు.

By:  Sivaji Kontham   |   5 Jun 2026 8:56 PM IST
ప్ర‌ధాని మోదీ ప్ర‌చారం చేస్తున్న ఈ జొన్న‌ రొట్టె తిన్నారంటే వ‌దిలిపెట్ట‌రు!
X

స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం- దేశీ ఆహారాన్ని ప్రజలకు చేరవేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తన 123వ `మన్ కీ బాత్` కార్యక్రమంలో కర్ణాటకలోని కళాబురగికి చెందిన ఒక విశిష్టమైన రొట్టె గురించి ప్రస్తావించారు. ఈ రొట్టె కేవలం మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా.. పోషక విలువలు కలిగిన భారతీయ సాంప్రదాయ ఆహారంగా పెద్ద ఎత్తున ప్రజలకు చేరువవుతోందని ప్రధాని మోదీ ప్రశంసించారు.

కళాబురగి మహిళలు జొన్న రొట్టెను ఒక అద్భుతమైన బ్రాండ్‌గా మార్చారని పిఐబి పత్రికా ప్రకటనలో ప్రధాని పేర్కొన్నారు. వారు ఏర్పాటు చేసుకున్న సహకార సంఘం ద్వారా ప్రతిరోజూ మూడు వేలకు పైగా రొట్టెలు తయారవుతున్నాయి. ఈ రొట్టెల సువాసన ఇప్పుడు కేవలం గ్రామాల్లోనే కాకుండా బెంగళూరులోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా.. ఆన్‌లైన్ ఫుడ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పెద్ద నగరాల వంటగదులకు కూడా చేరుకుంటోంది. దీనివల్ల అక్కడి మహిళల ఆదాయం పెరిగి వారి జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందని ఆయన కొనియాడారు.

కళాబురగి రొట్టె (పూర్వపు గుల్బర్గా) అనేది ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పండే ప్రధాన ధాన్యమైన జొన్న పిండితో తయారుచేసే ఒక సాంప్రదాయకమైన రొట్టె. పెద్ద పరిమాణం.. మెత్తని స్వభావం.. సహజమైన రుచికి ఈ రొట్టె ఎంతో ప్రసిద్ధి చెందింది. వేడి నీటితో పిండిని కలిపి చేత్తోనే ఎంతో నైపుణ్యంగా గుండ్రంగా తడుతూ.. వేడి పెనంపై దీనిని కాలుస్తారు. ఈ వేడి వేడి జొన్న రొట్టెలను గుత్తి వంకాయ కూర (ఎన్నెగాయి), పల్లీల గ్రేవీ లేదా వెల్లుల్లి, నువ్వులు, వేరుశెనగలతో చేసిన ఘాటైన చట్నీలతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ వెనుక కళాబురగి జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ - స్వయం సహాయక బృందాల (ఎస్‌.హెచ్‌.జిలు) సమన్వయకర్తల బలమైన మద్దతు ఉంది. సాంప్రదాయ పద్ధతుల్లో పోషక విలువలు గల జొన్న రొట్టెలను తయారుచేసే మహిళా పారిశ్రామికవేత్తలు ఈ ఉమ్మడి కృషికి గుండెకాయ లాంటివారు. చిన్న మార్కెటింగ్ బృందం సహాయంతో అమెజాన్, జొమాటో, మీషో వంటి ఆధునిక ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ రొట్టెలను విక్రయిస్తూ కళాబురగి రొట్టెను మహిళా సాధికారతకు ఒక ప్రతీకగా నిలిపారు.

ఆరోగ్య పరంగా జొన్నలను చిరుధాన్యాల రాజు (కింగ్ ఆఫ్ మిల్లెట్స్‌) గా పిలుస్తారు. ఇది బరువు తగ్గడానికి, మధుమేహం (డయాబెటిస్) నియంత్రణకు, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... జొన్న ఆహారాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడమే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి క్యాన్సర్- ఇన్ ఫ్ల‌మేషన్ (వాపులు) వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే గుణాలను కలిగి ఉన్నాయని తేలింది.