Begin typing your search above and press return to search.

తమిళనాడులో మోడీ.. ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు!

ఈ క్రమంలో... బ్రిటన్, మాల్దీవుల పర్యటనల్లో చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు చెప్పిన మోడీ... ఆత్మవిశ్వాసంతో భారత్‌ అభివృద్ధి చెందుతోందని అన్నారు.

By:  Tupaki Desk   |   27 July 2025 10:34 AM IST
తమిళనాడులో మోడీ.. ఆపరేషన్  సిందూర్  పై కీలక వ్యాఖ్యలు!
X

ప్రధాని నరేంద్ర మోడీ ఏ ప్రాంతంలో పర్యటించినా.. ఎక్కడ ప్రసంగించినా.. మీడియా ముందుకు వచ్చినా.. కచ్చితంగా ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు, వారిని పెంచి పోషిస్తున్న వారికీ భారత్ దెబ్బ రుచి చూపించిన విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడులో పర్యటించిన మోడీ.. మరోసారి ఆపరేషన్ సిందూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... మాల్దీవుల పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. శనివారం రాత్రి తమిళనాడులోని తూత్తుకుడికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో, తమిళుల సంప్రదాయ దుస్తులలో విచ్చేసిన మోడీకి రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, ఎల్‌.మురుగన్, రాష్ట్ర మంత్రి తంగం తెన్నరసు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా... రూ.450 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తూత్తుకుడి విమానాశ్రయంలో విస్తరించిన కొత్త టెర్మినల్‌ ను మోడీ ప్రారంభించారు. ఇదే సమయంలో... రాష్ట్రంలో రూ.4,900 కోట్లతో పూర్తిచేసిన వివిధ రైల్వే మార్గాలను, రహదారులను ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ... బ్రిటన్, మాల్దీవుల పర్యటనల ఫలితాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ ఇచ్చారు.

ఈ క్రమంలో... బ్రిటన్, మాల్దీవుల పర్యటనల్లో చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు చెప్పిన మోడీ... ఆత్మవిశ్వాసంతో భారత్‌ అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ సందర్భంగా.. గత 11 ఏళ్లలో రహదారులు, ఇంధనం, విమానాశ్రయాలు సహా తమిళనాడులో పలు పథకాలను పూర్తి చేసినట్లు చెప్పారు. తూత్తుకుడి విమానాశ్రయం కొత్త టెర్మినల్‌ ద్వారా ఏడాదికి 20 లక్షల మంది రాకపోకలు సాగించొచ్చన్నారు.

ఈ నేపథ్యంలోనే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్య "ఆప్రేషన్ సిందూర్" గురించి ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆపరేషన్‌ సిందూర్‌ తో భారత్‌ బలం తెలిసిందని, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంలో 'మేక్‌ ఇన్‌ ఇండియా' కీలక పాత్ర వహించిందని ప్రధాని అన్నారు.

ఇక తూత్తుకుడి విమానాశ్రయంలో విస్తరించిన కొత్త టెర్మినల్‌ విషయానికొస్తే... 17,340 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ టెర్మినల్.. రద్దీ సమయాల్లో 1,350 మంది ప్రయాణికులను, ఏడాదికి 20 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించడానికి వీలుగా ఉంటుందని చెబుతున్నారు. 100 శాతం ఎల్.ఈ.డీ లైటింగ్, ఆన్-సైట్ మురుగునీటి శుద్ధి కర్మాగారం ద్వారా శుద్ధి చేయబడిన నీటి పునర్వినియోగంతో టెర్మినల్ నిర్మించబడింది.

ఈ ఆధునిక మౌలిక సదుపాయాలు దక్షిణ తమిళనాడులో ప్రాంతీయ వాయు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయని.. తద్వారా పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని భావిస్తున్నారు.