పాక్ అసలు యుద్ధంలోనే లేదు... పీవోకే పై మోడీ సరైన సంచలన వ్యాఖ్యలు!
భారత్ - పాకిస్థాన్ కాల్పుల విరమణ అనంతరం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 May 2025 7:13 PM ISTభారత్ - పాకిస్థాన్ కాల్పుల విరమణ అనంతరం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. సరైన సమయంలో సరైన రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని.. ఉగ్రవాదంపై పోరులో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక మిగిలింది పీవోకే అన్నారు!
భారత్ - పాక్ కాల్పుల విరమణ అనంతరం తన నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సామావేశం నిర్వహించారు మోడీ. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో... మన ఆర్మీ చేసిన దాడులతో పాకిస్థాన్ పూర్తిగా ధ్వంసమైందని ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులతో జరిగిన భేటీలో వెల్లడించారు. భారత్ గెలిచిందని నొక్కి చెప్పారు!
ఇదే సమయంలో... మనం చేసిన యుద్ధంలో ప్రతీ రౌండ్ లోనూ పాకిస్థాన్ ఓడిపోయిందని చెప్పిన మోడీ.. మనం చేసిన దాడులతో వాళ్లు అసలు అసలు యుద్ధంలోనే లేరనే విషయం అర్ధమైందని ఎద్దేవా చేశారు. ఈ స్థాయిలో జరిపిన దాడులతో పాకిస్థాన్ కు గట్టిగానే సమాధానం చెప్పామని మోడీ అన్నారు. ఈ క్రమంలో మూడు లక్ష్యాలను మనం పూర్తి చేశామని వివరించారు.
వీటిలో.. మిలటరీ లక్ష్యంలో భాగంగా.. మహవల్పూర్, ముర్కిదే, ముజఫరాబాద్ టెర్రర్ క్యాంపులను మట్టిలో కలిపేశామని.. పొలిటికల్ లక్ష్యంలో భాగంగా.. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ముగిసే వరకూ సిందూ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని.. సైజలాజికల్ లక్ష్యంలో భాగంగా.. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసి సక్సెస్ అయ్యామని అన్నారు.
ఇదే సమయంలో.. కశ్మీర్ విషయంలో తమకు స్పష్టమైన వైఖరి ఉందని మోడీ మరోసారి స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి రావడమనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని తేల్చి చెప్పారు. పీఓకేను, ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాలని.. ఇది తప్ప ఆ దేశంతో మాట్లాడటానికి ఏమీ లేదని.. ఈ విషయంలో మరో దేశం జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు.
ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు!:
భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, దౌత్యపరమైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణను స్వాగతించారు. అనంతరం.. వేల సంవత్సరాల నాటి కాశ్మీర్ సమస్యపైనా మద్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చారు.
దీంతో... డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ స్వాగతించగా.. భారతదేశం అలాంటి మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. కాశ్మీర్ విషయంలో ఇంక మాట్లాడటానికి ఏమీ లేదని.. పీఓకే ను భారత్ కు అప్పగించడం మాత్రమే మిగిలి ఉందని భారత్ స్పష్టం చేసింది.
