ఈ మఫ్లర్ ప్రత్యేకత ఏంటో తెలుసా? న్యూజిలాండ్ పర్యటనలో ప్రధాని ఇంట్రెస్టింగ్ స్పీచ్
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు ప్రధాని మోదీ మూడు దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.
By: Tupaki Political Desk | 13 July 2026 4:35 PM ISTప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు ప్రధాని మోదీ మూడు దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. తొలుత ఇండోనేషియా వెళ్లిన ప్రధాని అక్కడి నుంచి ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్ లో పర్యటించారు. కాగా, గత 40 ఏళ్లలో న్యూజిలాండ్ ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఇదే సందర్భంలో ఆయన న్యూజిలాండ్ లో ప్రవాసభారతీయుల సమావేశంలో తీవ్ర భావోద్వేగంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు 25 నుంచి 30 ఏళ్ల క్రితం తాను గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో న్యూజిలాండ్ లో పర్యటించగా, అప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తు చేస్తూ సభికులను ప్రధాని ఆశ్చర్యపరిచారు.
చెదరని జ్ఞాపకం
న్యూజిలాండ్ లో ఎన్ఆర్ఐల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, తన మెడలో ఉన్న మఫ్లర్‌ను తీసి ప్రేక్షకులకు చూపించారు. "ఈ మఫ్లర్‌ను చూడండి.. ఇది సుమారు 25-30 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు నాకు ఒక మిత్రుడు బహుమతిగా ఇచ్చారు. ఇన్ని ఏళ్లు గడిచినా, నేను దాన్ని ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాను, అవసరమైనప్పుడు వాడుతుంటాను" అని చెప్పారు. ఏళ్ల తరబడి ఒక వస్తువును అంత భద్రంగా ఉంచుకోవడమే కాకుండా ఆ మఫ్లర్ ను న్యూజిలాండ్ తీసుకువెళ్లిన తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవడం ద్వారా ప్రధాని మోదీ సభికుల మనసు దోచుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
మీ ప్రేమ కూడా అంతే..
కేవలం ఒక మఫ్లర్‌ను గుర్తుచేసుకోవడమే కాకుండా, దాన్ని దేశ ప్రజల ప్రేమతో పోల్చడం ప్రధాని మోదీ రాజకీయ చతురతను తెలియజేస్తోందని అంటున్నారు. ‘ఈ మఫ్లర్‌ను ఎలాగైతే నేను ఇన్నాళ్లూ జాగ్రత్తగా దాచుకున్నానో, మీరంతా నాపై చూపిస్తున్న అమితమైన ప్రేమను కూడా నేను అలాగే నా గుండెల్లో భద్రపరుచుకుంటాను’ అంటూ ప్రధాని వ్యాఖ్యానించిన వెంటనే సభ మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది.
ప్రేక్షకుల్లో జోష్!
ప్రధాని మాటలు విన్న సభికులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేలాది మంది జనం ఆయన మాటలకు చప్పట్లు కొడుతూ, నినాదాలతో తమ మద్దతును వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, తనను ఆదరించే ప్రజలను ఒక కుటుంబ సభ్యుడిగా భావించే మోదీ శైలికి ఈ ప్రసంగం నిదర్శనంగా నిలిచిందని వ్యాఖ్యానిస్తున్నారు. వస్తువుల పట్ల చూపే గౌరవం, మనుషుల పట్ల చూపే ప్రేమ.. ఈ రెండింటినీ కలిపి మోదీ చెప్పిన విధానం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాయకుడు అంటే కేవలం అధికారం చలాయించేవాడు మాత్రమే కాదని, ప్రజల మనసులను గెలుచుకునేవాడు అని ప్రధాని మరోసారి నిరూపించారని కొనియాడుతున్నారు.
