కనెక్టివిటీలో కొత్త అధ్యాయం... బాబు చేతుల్లో ఏపీ ఫ్యూచర్ చెప్పిన మోడీ!
అవును... ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు చేశారు.
By: Tupaki Desk | 2 May 2025 8:15 PM ISTఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం శంకుస్థానలు చేశారు. ఈ సందర్భంగా... ఏపీ రాజధాని అమరావతి పనులతో పాటు రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను మోడీ ప్రారంభించారు! వీటిలో రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో చేపడతారు.
మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా రూ.8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు మోడీ ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. ఈ విధంగా మొత్తం 18 ప్రజెక్టులకు ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన పునఃనిర్మాణ కార్యక్రమ బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా విభజిత ఏపీకి రైల్వే బడ్జెట్ లో కేటాయింపులను ప్రధానంగా ప్రస్థావించారు.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పిన ప్రధాని మోడీ... రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు.. మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుందని అన్నారు. ఈ అనుసంధానం తీర్థయాత్రలకు, పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.
వాస్తవానికి కనెక్టివిటీ అనేదీ ఆ ప్రాంత, ఆ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుందని అంటారు. అందుకే రోడ్డు, రైలు, వాయు, జల రవాణా ఏ ప్రాంతానికి విరివా ఉంటుందో.. మిగిలినవాటితో పోలిస్తే ఆ ప్రాంతం అభివృద్ధిలో పది అడుగులు ముందు ఉంటుంది. ఇదే విషయాన్ని ఏపీ విషయంలో ప్రస్థావించిన మోడీ.. రైల్వే బడ్జెట్ లో కేటాయింపులను గుర్తు చేశారు.
ఇందులో భాగంగా... ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ రు.900 కోట్ల లోపే ఉండగా.. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రూ.9 వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చామని.. ఏపీకి గతం కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామని.. ఫలితంగా, గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జ్ లు, అండర్ పాస్ లు నిర్మించామని ప్రధాని తెలిపారు.
ఇదే సమయంలో... ఏపీకి వందేభారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించామని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో సుమారు 70 రైల్వే స్టేషన్ లను అమృత్ భారత్ ప్రాజెక్ట్ లో భాగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనతో సిమెంట్, స్టీల్, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయని.. ఫలితంగా అర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని స్పష్టం చేశారు.
అదేవిధంగా... రైతు వికాసానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషిచేస్తోందని చెప్పిన ప్రధాని మోడీ... రైతులకు పథకాలు, పంట నష్ట పరిహారం కింద రూ.17 వేల కోట్ల సాయం చేసినట్లు వెల్లడించారు. త్వరలో పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరానికీ నీరు ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు!
ఇక.. అమరావతి పనులు మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో తాను ఊహించగలనని చెప్పిన ప్రధాని మోడీ... అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర గతిని మార్చబోతోందని అన్నారు. ఈ సమయంలో ఏపీ అభివృద్ధిలో మీ భుజంతో కలిపి నా భుజం పనిచేసుందని.. ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
