Begin typing your search above and press return to search.

అమరావతికి మోడీ ఎందుకో చెప్పిన బాబు!

ఒకసారి అమరావతికి శంకుస్థాపన మోడీ చేశారు కదా మళ్ళీ ఆయన రావడం ఎందుకు అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   27 April 2025 10:25 PM IST
అమరావతికి మోడీ ఎందుకో చెప్పిన బాబు!
X

అమరావతి రాజధాని నిర్మాణ ప్రక్రియ అన్నది 2015 అక్టోబర్ 22న ప్రారంభం అయింది. అంటే ఇప్పటికి పదేళ్ళ కాలం ముందు అన్న మాట. ఈ మధ్యలో టీడీపీ దిగిపోయి వైసీపీ వచ్చింది. అమరావతి రాజధానిలో అడుగు ముందుకు పడలేదు. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించింది.

మొత్తానికి ఆర్ధిక వనరులు అన్నీ సమకూరాయి. అదే సమయంలో కేంద్రం కూడా గతానికి భిన్నంగా ఏపీ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తోంది. అమరావతి రాజధాని కోసం రుణ సదుపాయాలను అందిస్తోంది. అలాగే అమరావతి రాజధాని సెంటిమెంట్ ని గురించి గౌరవిస్తోంది.

ఇలా అన్ని పాజిటివ్ వైబ్స్ మధ్యన అమరావతి పునర్ నిర్మాణ పనులు మొదలవుతున్నాయి. దానికి మే 2న డేట్ ని ఫిక్స్ చేశారు. అయితే ఆ రోజున ప్రధాని నరేంద్ర మోడీని రప్పించి ఆయన చేతున మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఒకసారి అమరావతికి శంకుస్థాపన మోడీ చేశారు కదా మళ్ళీ ఆయన రావడం ఎందుకు అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

అయితే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ధీటైన జవాబు చెబుతున్నారు. గత అయిదేళ్ళలో అమరావతి రాజధాని అడుగు ముందుకు పడలేదు, పైగా అమరావతిని దెబ్బ తీయాలని భారీ కుట్ర సైతం జరిగింది అని అన్నారు. అమరావతి రాజధాని పట్ల చాలా రాజకీయం జరిగిందని ఆయన విమర్శించారు.

ఏపీకి రాజధాని అన్నది లేకుండా చేశారని మండిపడ్డారు. ఇక అమరావతి మళ్ళీ తలెత్తుకుని నిలబడి అందరి రాజధానిగా ఉండాలన్న మంచి ఉద్దేశ్యంతోనే పునర్ నిర్మాణం పనులు చేస్తున్నామని అన్నారు. పైగా జాతీయ స్థాయిలో అమరావతి వికాసం గురించి తెలియచేయాలన్న కోరిక మేరకే ఈ విధంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నామని అన్నారు.

అమరావతి రాజధాని ఏపీ ప్రజల సెంటిమెంట్ గా బాబు అంటున్నారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాలు వస్తారని ఆయన చెప్పారు. అమరావతి ఏపీ మొత్తానికి సంపదను సృష్టించే అతి పెద్ద అభివృద్ధి కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక మే 2తో ఏపీ అభివృద్ధి కొత్త మలుపు తిరుగుతుందని కూడా చంద్రబాబు చెప్పారు. ఏపీ ప్రజల బంగారు స్వప్నం అయిన అమరావతి రాజధానిని ఎవరూ చిదిమి పారేయలేరు అని చాటేందుకే అత్యంత అద్భుతంగా మే 2న కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే లక్ష కోట్లతో రాజధాని పునర్ నిర్మాణ పనులు మొదలవుతున్నాయి. వీటిని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.

అదే విధంగా అమరావతిని ఒక కాల పరిమితిని విధించి కీలకమైన నిర్మాణాలను మూడేళ్ళలోగా పూర్తి చేయాలని కూడా నిర్ణయించుకుంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ని సక్సెస్ చేయడం కోసం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలే చేశారు. ఏపీ ఫ్యూచర్ అమరావతి అని ఆయన అన్నారు

రాష్ట్రంలోని ప్రతి పౌరుడు నాది ఆంధ్ర ప్రదేశ్ నా రాజధాని అమరావతి అని చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తితో ఉన్నారని తెలిపారు. తాజాగా ప్రధానితో జరిగిన ఢిల్లీ భేటీలో అమరావతి రాజధాని విషయంలో పలు సూచనలు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.