మోడీ తాజా ఫారిన్ టూర్.. విశేషాలకు కొదవలేదు
ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ విదేశీ పర్యటనల జోరు పెంచారు.
By: Tupaki Desk | 28 Jun 2025 10:18 AM ISTముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ విదేశీ పర్యటనల జోరు పెంచారు. మొదటి టర్మ్ నుంచి ఆయన విదేశీ పర్యటనల విషయంలో ఎక్కువ ఫోకస్ చేసే వారన్న విషయం తెలిసిందే. ఒకదశలో ఆయన భారతదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ ఉంటున్నారన్న విమర్శ కూడా వెల్లువెత్తింది. ఎప్పుడు ఏ దేశంలో ఉంటారో అర్థం కావట్లేదని.. ప్రజలకు అందుబాటులో లేకుండా విదేశీ పర్యటను అంత ఎక్కువ చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నను పలువురు సంధించారు. అయితే.. మోడీ హయాంలో అంతర్జాతీయంగా భారత్ బ్రాండింగ్ మరింత పెరిగిందన్న వాదనలు ఉన్నాయి.
ఈ మధ్యన విదేశీ పర్యటనను ముగించుకొచ్చిన ఆయన వచ్చే నెల (జులై) 2 నుంచి ఎనిమిది రోజుల పాటు విదేశీ పర్యటనలలో ఉండనున్నారు. తాజా టూర్ లో ఆయన ఐదు దేశాల్ని కవర్ చేయనున్నారు. మోడీ తాజా ఫారిన్ టూర్ తో పలు రికార్డులు బద్ధలు కానున్నట్లు చెబుతున్నారు. బ్రెజిల్ లోని రియోడీజనిరోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొంటారు.
ఆ తర్వాత ఘనా.. ట్రినిడాడ్ అండ్ టొబాగో.. అర్జెంటీనా.. నమీబియాల్లో పర్యటించనున్నారు. తన టూర్ ఆరంభంలో ఆయన జులై రెండు మూడు తేదీల్లో ఆఫ్రికా దేశమైన ఘనాకు వెళ్తారు. ఆ దేశానికి మన ప్రధాని ఒకరు పర్యటించటం గడిచిన మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారిగా చెబుతున్నారు ఘనా పర్యటన అనంతరం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్లనున్నారు. అక్కడ జులై మూడు.. నాలుగు తేదీల్లో ఉంటారు.
1999 తర్వాత ఆ దేశానికి వెళ్లిన మొదటి భారత ప్రధాని మోడీనే అవుతారు. జులై 4, 5 తేదీల్లో అర్జెంటీనాకు వెళతారు. జులై 5 - 8 వరకు బ్రిక్స్ సమిట్ లో పాల్గొంటారు. చివరకు నమీబియాకు ఆయన వెళతారు. ఆ దేశాన్ని పర్యటించిన భారత మూడో ప్రధానిగా నరేంద్ర మోడీ నిలుస్తారు. ఇలా.. పలు దేశాలకు సుదీర్ఘ విరామం తర్వాత వెళుతున్న భారత ప్రధానిగా నరేంద్ర మోడీ నిలుస్తారు.
