Begin typing your search above and press return to search.

ప్రధాని మోదీ తెలంగాణ టూర్ - డెవలప్‌మెంట్ + పాలిటిక్స్.. ఇంట్రెస్టింగ్!

వచ్చేనెల రెండో వారంలో ప్రధాని మోదీ పర్యటనకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. బీబీ నగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవంతోపాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   21 March 2026 11:55 PM IST
ప్రధాని మోదీ తెలంగాణ టూర్ - డెవలప్‌మెంట్ + పాలిటిక్స్.. ఇంట్రెస్టింగ్!
X

వచ్చేనెల రెండో వారంలో ప్రధాని మోదీ పర్యటనకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. బీబీ నగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవంతోపాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలన్న ఏకైక లక్ష్యం పెట్టుకున్న బీజేపీ.. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు.

ప్రధాని మోదీ టూర్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. కానీ, ఏప్రిల్ లో ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ శ్రేణులకు సమాచారం ఇచ్చారని అంటున్నారు. దీంతో ప్రధాని పర్యటనపై ఊహగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ తోపాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారం నేపథ్యంలో ప్రధాని పర్యటనకు బీజేపీ ఏర్పాట్లు చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతోపాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలతోపాటు పార్టీ తరపున సన్నాహాక కార్యక్రమాలు మొదలుపెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ వర్గాలకు సూచించారని అంటున్నారు. హైదరాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటన ద్వారా బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపేలా చూడాలని బీజేపీ నేతలు చూస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ వంటి పెద్ద వేదికపై బహిరంగ సభ నిర్వహించడం ద్వారా బీజేపీ తన బలాన్ని చాటాలని భావిస్తున్నారు.

బీబీనగర్ ఎయిమ్స్ వంటి భారీ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఎంతగా కట్టుబడి ఉందో ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తోంది. తాము నిధులు ఇస్తున్నామని, అభివృద్ధి చేస్తున్నామనే సందేశాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ నగరంలో ఆ పార్టీ పూర్తిగా పట్టు సాధించలేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది.

అయితే హైదరాబాద్ తోపాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 24 అసెంబ్లీలకు 21 చోట్ల బీఆర్ఎస్ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నగరంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిందని అంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి దగ్గరగా వచ్చిన ఆ పార్టీ ఆ తర్వాత చతికిలపడిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న రాజకీయాన్ని తమవైపు తిప్పుకోడానికి ప్రధాని మోదీ సభను వాడుకోవాలని కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రధాని మోదీ పర్యటన సమాచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.