మోడీ ఏపీకి మళ్ళీ మళ్ళీ !
ఇక ప్రధాని మరోసారి ఏపీకి వస్తానని అమరావతి పునర్ నిర్మాణ సభలో చెప్పారు. జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి తాను మళ్ళీ ఏపీకి వస్తున్నాను అని చెప్పారు.
By: Tupaki Desk | 2 May 2025 3:20 PMప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఏపీకి వివిధ రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులను అందిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఏపీ ప్రజల పట్ల కూడా నిండు అభిమానం చూపిస్తున్నారు.
ఇక వచ్చినప్పుడల్లా తెలుగులో మాట్లాడుతూ ప్రత్యేక అనుసంధానం అవుతున్నారు. మీ అందరినీ కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలుగులో చెప్పిన ప్రధాని అమరావతి కేవలం ఒక నగరం కాదని ఆధునిక శక్తి అని కూడా తెలుగులో చెప్పారు. ఇది మనమే చేయాలి అమరావతి అని అంటూ తెలుగులో మోడీ మాట్లాడడం కూడా విశేషం. తన అరగంటకు పైగా ప్రసంగంలో అనేక సార్లు తెలుగులో ప్రధాని ఈసారి మాట్లాడడం ఒక ప్రత్యేకతగా ఉంది.
ఇక ప్రధాని మరోసారి ఏపీకి వస్తానని అమరావతి పునర్ నిర్మాణ సభలో చెప్పారు. జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి తాను మళ్ళీ ఏపీకి వస్తున్నాను అని చెప్పారు. విశాఖపట్నంలో ఆ రోజు జరిగే ఇంటర్నేషనల్ యోగా డేలో అందరితో కలసి తాను యోగా చేస్తాను అని చెప్పారు. ఇక ఆ రోజుకు మరో విశిష్టత ఉందని చెప్పిన ప్రధాని అంతర్జాతీయ హోదా దక్కించుకున్న్న తరువాత యోగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న అరుదైన సందర్భం అన్నారు.
మరో వైపు చూస్తే ప్రధాని మోడీ ఏపీకి గడచిన నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు వచ్చారు. ఈ ఏడాది జనవరి 8న ఆయన విశాఖ వచ్చారు. ఆ రోజున మూడు లక్షలకు పైగా విలువ చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మళ్ళీ మే 2న మరోసారి వచ్చారు.
ఈసారి అమరావతి వేదికగా దాదాపుగా లక్ష కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శ్రీకరం చుట్టారు. ఇక మరో యాభై రోజుల వ్యవధిలోనే మోడీ ఏపీకి వస్తున్నారు. అది అంతర్జాతీయ యోగా డే సందర్భంగా. ఈ విధంగా చూస్తే కనుక మోడీ ఏపీకి కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు సార్లు వచ్చినట్లు అవుతుంది. మరి మిగిలిన ఆరు నెలలలో కూడా ఆయన ఏపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.
ఇలా ఒక వైపు నిధులు ఇస్తూ మరో వైపు ఆర్ధిక వనరులకు ఆస్కారం కల్పిస్తూ ఇంకో వైపు ఏపీ ప్రభుత్వంతోనూ చంద్రబాబుతోనూ భుజం కలిపి పనిచేస్తామని ప్రధాని మోడీ చెప్పడం ద్వారా సౌత్ ఇండియాలో ఏపీ తమకు ఫస్ట్ అని చెప్పకనే చెప్పేసారు అని అంటున్నారు. మోడీ ఫోకస్ ఇపుడు పూర్తిగా ఏపీ పైన ఉంది. అలా ఆయన ప్రేమాభిమానాలు నిండుగా ఏపీ మీద ప్రసరింపచేయడానికి చంద్రబాబు పరిశ్రమ, పవన్ కళ్యాణ్ ఆయన పట్ల చూపించే గౌరవ మర్యాదలు మరో కారణం అని చెప్పాల్సి ఉంది.