Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీకి దేవాన్ష్ గిఫ్ట్

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వచ్చారు. ఈ కార్యక్రమం సడెన్ గా ఫిక్స్ అయింది. నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఉందని పదిహేను రోజుల ముందు నుంచే తెలుసు.

By:  Satya P   |   11 May 2026 9:41 AM IST
ప్రధాని మోడీకి దేవాన్ష్ గిఫ్ట్
X

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వచ్చారు. ఈ కార్యక్రమం సడెన్ గా ఫిక్స్ అయింది. నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఉందని పదిహేను రోజుల ముందు నుంచే తెలుసు. మే 10న మోడీ భాగ్యనగరానికి వస్తున్నారు అన్నది తెలిసి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే అనూహ్యంగా మోడీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇళ్ళకు వెళ్ళడం అన్నది జత చేరింది. మోడీ ఎన్నో సార్లు పర్యటనకు తెలంగాణాకు వచ్చారు. కానీ ఆయన ఎపుడూ ఇలా నేతల ఇళ్లకు వెళ్ళడం జరగలేదు. ఈసారి మాత్రం మోడీ మొత్తం టూర్ లో ఇదే హైలెట్ అయింది.

బాబు ఇంట్లో చాలా సేపు :

మొదట జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితుల మీద వాకబు చేసిన మోడీ అనంతరం చంద్రబాబు ఇంటికి వచ్చారు. ఇక బాబు ఇంటికి మోడీ రావడంతో అక్కడి వాతావరణమే పూర్తిగా మారిపోయింది. మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. అలాగే నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి, అదే విధంగా నారా దేవాన్ష్ మోడీతో పాటే ఉంటూ దేశాధినేతకు అతిధి మర్యాదలు చేశారు. ఇక చంద్రబాబు ఇంట్లో నరేంద్ర మోడీ తేనీటి విందుకు హాజరయ్యారు.

వర్తమాన రాజకీయాలు :

బాబు లోకేష్ లతో నరేంద్ర మోడీ వర్తమాన రాజకీయాల గురించి కాసేపు చర్చించారు. అదే సమయంలో ఆయన బాబు మనవడు లోకేష్ కుమారుడు అయిన దేవాన్ష్ ని ఆప్యాయంగా దగ్గరకు తీశారు. దేవాన్ష్ భుజం మీద చేయి వేసి మరీ కబుర్లు చెబుతూ అక్కడ కొంత దూరం నడిచారు. తన ఇంటికి ఏ అతిధి వచ్చినా బాబు స్వయంగా వారికి బహుమతులు ఇస్తారు. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా దేవాన్ష్ నరేంద్ర మోడీకి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుమతిగా ఇవ్వడం విశేషం. దేవాన్ష్ పక్కన బాబు లోకేష్ నిలబడి మరీ మోడీ పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు.

ఎప్పటికీ గుర్తుంటుంది :

ఇక తమ ఇంటికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సందర్భం అన్నది తాము ఎప్పటికీ మరచిపోలేమని బాబు ట్వీట్ చేశారు. మా కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక చిరస్మరణీయమైన సాయంత్రం గా మే 10న గడచింది అని ఆయన అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం మాకు గౌరవంతో పాటు ఆనందంగానూ ఉందని బాబు అన్నారు. మోడీ ఆప్యాయత, అనురాగం ఆయనతో జరిగిపిన ఉదారమైన సంభాషణ ఈ సందర్భాన్ని మా కుటుంబం మొత్తం అందరికీ నిజంగా ప్రత్యేకంగా చేశాయని బాబు చెప్పారు. తమ ఇంటికి వచ్చిన నరేంద్ర మోడీకి బాబు ధన్యవాదాలు తెలిపారు.