యూరప్ పర్యటనను రద్దు చేసుకున్న మోదీ.. ఏం జరుగుతోంది?
ప్రధాని పర్యటనల రద్దుకు ప్రధాన కారణం సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలే.
By: Tupaki Desk | 7 May 2025 4:31 PM ISTభారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న కీలక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ ఈ నెలలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో పర్యటించాల్సి ఉంది. ముందుగా అనుకున్న ఈ నాలుగు రోజుల యూరప్ పర్యటన రద్దైంది. అంతేకాకుండా, మరో రెండు రోజుల్లో రష్యాలో జరిగే కీలక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న ప్రధాని తన రష్యా పర్యటనను కూడా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. నాజీలపై సోవియట్ యూనియన్ సాధించిన విజయం సందర్భంగా మే 9న రష్యాలో విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉండగా, పర్యటన రద్దు చేయబడింది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. భారత్ తరపున మరొక అధికారి హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ప్రధాని పర్యటనల రద్దుకు ప్రధాన కారణం సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలే. పహాల్గాం దాడికి ప్రతీకారంగా, ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై బుధవారం అర్ధరాత్రి 1.44 గంటలకు మెరుపుదాడి నిర్వహించింది. మొత్తం తొమ్మిది ఉగ్రస్థావరాలపై బాంబులు వేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ దాడిలో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు, మృతుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ విజయవంతమైన ఆపరేషన్ అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పరిస్థితిపై వివరాలు తెలియజేశారు. అంతకుముందు కేబినెట్ సమావేశం నిర్వహించి, సరిహద్దు పరిస్థితులను సమీక్షించారు.
పహాల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత త్రివిధ దళాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సైన్యానికి సెల్యూట్ చేస్తూ సోషల్ మీడియాలో తమ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా త్రివిధ దళాలను, కేబినెట్‌ను ఈ సందర్భంగా ప్రశంసించారు. దేశీయంగా నెలకొన్న ఈ కీలక పరిస్థితులు, సరిహద్దు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే ప్రధాని తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు.
