ఏపీ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి.. చంద్రబాబు, పవన్ మధ్య సీరియస్ డిస్కషన్
బిహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 20 Nov 2025 8:47 AM ISTబిహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిహార్ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన ఎన్డీఏ.. నెక్ట్స్ టార్గెట్ గా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఎంచుకుంది. ఈ రాష్ట్రాల్లో అందని ద్రాక్షగా ఉన్న అధికారాన్ని సాధించాలనే ఉద్దేశంతో పావులు కదుపుతోంది. వచ్చే ఏడాది ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున.. ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఏపీకి మరో మంత్రి పదవి ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు కేబినెట్ మంత్రి కాగా, మిగిలిన ఇద్దరు సహాయ మంత్రులు. అదేవిధంగా టీడీపీకి రెండు బీజేపీకి ఒకటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో జనసేన కూడా కీలక భాగస్వామిగా ఉన్నా ఆ పార్టీకి మంత్రి పదవి దక్కలేదు. రాష్ట్రంలో జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. దీంతో తాజాగా చేపట్టే విస్తరణలో ప్రధాని ఏ పార్టీకి అవకాశం ఇస్తారనేది ఆసక్తికర చర్చకు తావిస్తోంది.
జనసేనకు ప్రాతినిధ్యం లేనందున ఆ పార్టీ నేతలకు అవకాశం ఇస్తారా? లేక రాష్ట్రం నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వదిలేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ముగ్గురు మంత్రులు ఉండగా, ఇందులో ఒకరు బీసీ, ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన వారు. అదేవిధంగా ముగ్గురు కోస్తా ప్రాంతానికే చెందిన వారు. జనసేన ఎంపీలు కూడా ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడం, ఆ ఇద్దరూ అగ్రవర్ణాలకు చెందిన వారు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.
జనసేన నుంచి ఎమ్మెల్సీ నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ మేరకు గతంలో హామీ ఇచ్చారు. ఎప్పుడు రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించినా, జనసేన నేత నాగబాబు మంత్రి కావడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. దీంతో ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రి టీడీపీ నుంచే ఉంటారని అంటున్నారు. ఇదేసమయంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతను ఎంపిక చేయాలన్న సూచనలు వస్తున్నట్లు చెబుతున్నారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి చాన్స్ ఇవ్వాలని అభిప్రాయం ఉంది. మరోవైపు రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు ఆ సామాజికవర్గానికి కేంద్ర కేబినెట్ లోకి పంపాలని సీఎం భావిస్తున్నారని అంటున్నారు.
చంద్రబాబు ఆలోచనలు నిజమైతే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి మధ్య కేబినెట్ మంత్రి పదవికి పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే సమయంలో ఎస్సీ కోటాలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేరును పరిశీలిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా ఏపీ నుంచి ఒకరికి చాన్స్ వస్తుందన్న ప్రచారం ఎంపీల్లో ఆశలు పెంచేస్తోందని అంటున్నారు.
