ఢిల్లీ పేలుడు...మోడీ రివ్యూ
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం సంభవించిన భారీ పేలుడు ఘటన నేపధ్యంలో కీలక నేతలు స్పందించారు.
By: Satya P | 10 Nov 2025 10:33 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ భారీ పేలుడుతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో జరిగిన పేలుడు తర్వాత మొత్తం పరిస్థితిని ఉన్నత స్థాయిలో సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి పరిస్థితిపై తాజా సమాచారం తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఏమి జరిగింది :
ఇక ఇదే విషయం మీద హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్ఏఐ, డీజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారని అధికార వర్గాల భోగట్టా. అంతే కాదు ఎన్ఎస్జీ, ఎన్ఐఏ ఫోరెన్సిక్ విభాగం బృందాలను సంఘటనా స్థలానికి చేరుకోవాలని అమిత్ షా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారని వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనకు సంబంధించి హోంమంత్రి ఐబీ డైరెక్టర్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
ప్రముఖుల సంతాపం
ఇదిలా ఉంటే ఢిల్లీలో జరిగిన పేలుడులో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. హోంమంత్రి అమిత్ షా ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించినట్లుగా ప్రధాని తెలియజేశారు. బాధితులకు అధికారులు సహాయం అందిస్తున్నారని ప్రధాని తెలిపారు.
కీలక నేతల స్పందన :
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం సంభవించిన భారీ పేలుడు ఘటన నేపధ్యంలో కీలక నేతలు స్పందించారు. ఈ విషాద ఘటన పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ భారీ పేలుడు ఘటన అత్యంత బాధాకరం అన్నరు. దీని వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేస్తోంది అన్నారు. ఈ ఘటన తరువాత పరిస్థితి అత్యంత హృదయ విదారకరంగా ఆందోళనకరంగా ఉంది అని ఆయన అన్నారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హై అలెర్ట్ తో :
ఇక ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ కారు బాంబు పేలుడు ఈ ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారులు వెంటనే ఢిల్లీ ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, ముంబై నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక ఈ భారీ పేలుడు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు కేవలం పది నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఎఫ్ఎస్ఎల్, ఎన్‌ఎస్‌జీ, ఎన్ఐఏ బృందాలు సంఘటన స్థలానికి వెళ్లి సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తారని వెల్లడించారు. తాను ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌ఛార్జ్‌తో మాట్లాడానని, వారు ఇంకా సంఘటన స్థలంలోనే ఉన్నారని తెలిపారు.
సమగ్ర దర్యాప్తు :
ఈ భారీ పేలుడుకి సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఈ పేలుడుకు సంబంధించిన కారణాలను సాధ్యమైంత త్వరగా దేశం ఎదుట ఉంచుతామని అన్నారు. మొత్తం మీద చూస్తే క్షణాలలోనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని మొత్తం జల్లెడు పడుతున్నారు. ఢిల్లీతో సహా కీలక ప్రదేశాలలో నిఘా పెంచారు.
