అమరావతికి మోడీ...పెద్దాయన ఈ సారి ఏమి తీసుకొస్తారో?
మోడీ ఇప్పటికి పదేళ్ళ క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతికి వచ్చి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
By: Tupaki Desk | 5 April 2025 12:00 PM ISTఏపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 19న వస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం థాయిలాండ్ పర్యటనలో ఉన్న మోడీ ఈ నెల 6న రామేశ్వరం వెళ్తారు. అలా తమిళనాడు పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత మోడీ మళ్ళీ దక్షిణాదిలో అడుగుపెట్టేది ఏపీలోనే అని అంటున్నారు. ఈ నెల 19న మోడీ టూర్ ఖరారు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
మోడీ ఇప్పటికి పదేళ్ళ క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతికి వచ్చి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆనాడు కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు, తెలంగాణా సీఎం కేసీఆర్ వంటి వారు కూడా ఈ మహత్తర కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి పదేళ్ళకు అదే మోడీ చేతున మీదుగా రాజధాని పునర్ నిర్మాణ పనులు మొదలవుతున్నాయి. వీటికి సంబంధించిన ఆర్థిక సహాయం ప్రపంచ బ్యాంక్ ఆసియన్ బ్యాంక్ ఇతర ఆర్ధిక ఏజెన్సీల ద్వారా ఏపీ ప్రభుత్వానికి అందుతోంది.
కేంద్రం ఈసారి ఏపీ రాజధాని కోసం 1400 కోట్ల రూపాయలను గ్రాంట్ రూపంలో ఇవ్వనుంది. గతంలో కూడా కేంద్రం రాజధాని నిర్మాణ కోసం 2,500 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెబుతున్నారు. అలా తన వంతుగా నాలుగు వేల కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తోంది. మరో వైపు చూస్తే అమరావతి రాజధానిని 55 వేల ఎకరాలలో నిర్మాణం చేయాలన్నది ఏపీ ప్రభుత్వం ఆలోచన. తొలిదశ పనులు ఇపుడు మొదలు కాబోతున్నాయి.
వీటి కోసం ప్రపంచ బ్యాంక్ ఆసియన్ బ్యాంక్ రెండూ కలిపి చెరి 6,700 కోట్ల రూపాయలను ఇస్తున్నాయి. కేంద్రం ఇచ్చే గ్రాంట్ తో 15000 కోట్ల నిధులు ఏపీ రాజధానికి దక్కుతాయి. వీటికి అదనంగా హడ్కో నుంచి 11 వేల కోట్ల రూపాయల నిధులు అమరావతి రాజధాని కోసం కేటాయిస్తున్నారు. ఈ మొత్తం నిధులు కలసి 26 వేల కోట్ల రూపాయలు అవుతాయి. ఇవి కాకుండా ఇంకా జర్మనీకు చెందీ ఆర్థిక సంస్థ నుంచి కూడా నిధుల సేకరణ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఈసారి చాలా ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. తొలిదశ పనులను కేవలం మూడేళ్ళ కాల వ్యవధిలో పూర్తి చేయగలిగితే ఆ మీదట అమరావతి రియల్ బూమ్ ఒక రేంజిలో పెరుగుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా దాని వల్ల ప్రభుత్వం వద్ద ఉన్న మిగులు భూములకు రేట్లు పెరిగి వాటి అమ్మకం ద్వారా అమరావతి అప్పులను తీర్చడమే కాకుండా ఆదాయం కూడా ప్రభుత్వానికి దక్కుతుందని లెక్కేస్తున్నారు
ఎట్టి పరిస్థితుల్లోనూ 2028 నాటికి అమరావతి తొలిదశ పనులను పూర్తి చేయాలని బాబు చూస్తున్నారు. వాటిని కనుక చూపిస్తే 2029 ఎన్నికల్లో జనాలు మరోసారి తనకే పట్టం కడతారు అన్న ఆలోచన కూడా ఆయనకు ఉంది. ఇక అమరావతిలో ప్రభుత్వం తన వంతుగా మౌలిక సదుపాయాలతో పాటు తొలిదశ పనులను పూర్తి చేస్తూనే ప్రైవేట్ సంస్థలను కూడా రమ్మని పిలుస్తోంది.
వారు సైతం తమకు కేటాయించిన భూములలో నిర్మాణాలను ప్రారంభిస్తే కనుక అమరావతి రాజధాని కళ్ళ ముందే శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఏమైనా కీలక పకటనలు చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.
