ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని... మృత్యుంజయుడికి పరామర్శ!
విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి మోడీ.. శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు.
By: Tupaki Desk | 13 Jun 2025 11:15 AM ISTఅహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది మృతి చెందారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు.
అవును... విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి మోడీ.. శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘటనాస్థలానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ప్రధానితోపాటు మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి చేరుకున్నారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైన విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ఆయన పరామర్శించారు. ఇదే సమయంలో ఈ విమాన ప్రమాదంలో గాయపడిన ఇతర మెడికోలతోనూ మోడీ మాట్లాడి ధైర్యం చెప్పారు.
కాగా... గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు పనిచేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ విషాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకం అని.. ఈ విచారకర సమయంలో తన ఆలోచనలు ఈ ప్రకాదం బారిన పడిన ప్రతీ ఒక్కరితోనూ ఉంటాయని తెలిపారు.
మరోవైపు ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ కూడా ప్రమదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం.. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
