Begin typing your search above and press return to search.

ఈ ఒక్క ఫొటోతో పాకిస్తాన్ కు షాకిచ్చిన మోడీ

ఈ నేపథ్యంలో ఆదంపుర్‌ను సందర్శించిన ప్రధాని మోదీ, అక్కడ మన పోరాట యోధులను కలవడం ఒక ప్రత్యేక అనుభూతినిచ్చిందని ఎక్స్ వేదికగా తెలిపారు.

By:  Tupaki Desk   |   13 May 2025 3:55 PM IST
PM Modi Visits Adampur Air Base
X

ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలు, భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదంపుర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడ ప్రధాని మోదీ మన ధైర్యవంతులైన సైనికులతో, వాయుసేన సిబ్బందితో మాట్లాడారు.

పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన అమానవీయ దాడికి ప్రతిగా మన భద్రతా బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించి, 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయని భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని పాకిస్థాన్ మే 9, 10 తేదీల్లో భారత భూభాగాలపై దాడులకు యత్నించింది. ఈ దాడులను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకున్న స్థావరాలలో ఆదంపుర్ వైమానిక స్థావరం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో ఆదంపుర్‌ను సందర్శించిన ప్రధాని మోదీ, అక్కడ మన పోరాట యోధులను కలవడం ఒక ప్రత్యేక అనుభూతినిచ్చిందని ఎక్స్ వేదికగా తెలిపారు. దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న త్యాగాలకు, ధైర్యసాహసాలకు యావత్ దేశం రుణపడి ఉంటుందని ఆయన అన్నారు. గంటన్నరకు పైగా వైమానిక స్థావరాంలో గడిపిన ప్రధాని, సిబ్బందితో ముచ్చటించి, ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ధరించిన టోపీపై త్రిశూల్ చిహ్నం కనిపించింది.

ఆపరేషన్ సిందూర్ విజయవంతమవడంతోనే పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని, భారత్ ప్రళయభీకర దాడులను తట్టుకోలేకే వారు 'కాళ్లబేరానికి' వచ్చారని ప్రధాని నిన్న దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించిన మరుసటి రోజే ఈ పర్యటన జరగడం గమనార్హం. నవయుగ యుద్ధంలో భారత్ పాకిస్థాన్‌ను మట్టికరిపించిందని, వారు సరిహద్దుల్లో కాలు దువ్వితే వారి గుండె పైనే కొట్టామని ఆయన గట్టిగా హెచ్చరించారు. పాక్ ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తామని, ఏమాత్రం తేడా వచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అవి కేవలం ఉగ్రవాద నిర్మూలన, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమేనని తేల్చిచెప్పారు.

-పాక్ తప్పుడు ప్రచారానికి చెక్:

పాకిస్థాన్ మీడియా, ప్రభుత్వం ఆదంపుర్ వైమానిక స్థావరాన్ని, ముఖ్యంగా అక్కడ మోహరించిన ఎస్‌-400 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని గతంలో తప్పుడు ప్రచారం చేశాయి. అంతేకాకుండా, భారత్‌లోని కీలక మౌలిక సదుపాయాలు, విద్యుత్, సైబర్ వ్యవస్థలపై దాడి చేసి నష్టం కలిగించామని కూడా ఆ దేశం అవాస్తవాలు ప్రచారం చేసింది. ఇది పూర్తిగా హేయమైన దుష్ప్రచారమని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అప్పట్లోనే ఖండించారు.

తాజాగా ప్రధాని మోదీ స్వయంగా ఆదంపుర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించి, అక్కడ ఎటువంటి నష్టం లేకుండా ఉన్న ఎస్‌-400 రక్షణ వ్యవస్థ చిత్రాలను పంచుకోవడం ద్వారా పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి గట్టి చెక్ పెట్టారు. వైమానిక స్థావరం, అక్కడ మోహరించిన కీలక వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయని స్వయంగా చూపించడం ద్వారా పాకిస్థాన్ వాదనల్లో పస లేదని నిరూపించారు. ఈ పర్యటన ద్వారా మన భద్రతా బలగాలకు దేశం తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రధాని గట్టి సందేశం ఇచ్చారు.