Begin typing your search above and press return to search.

హైవేపై కూలిన విమానం... వీడియో వైరల్!

రన్ వే పై పరుగెత్తాల్సిన విమానం.. ఆకాశంలో విహరించాల్సిన విమానం.. ఉన్నఫలంగా హైవేపై దర్శనమిచ్చింది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 6:43 AM GMT
హైవేపై కూలిన విమానం... వీడియో వైరల్!
X

రన్ వే పై పరుగెత్తాల్సిన విమానం.. ఆకాశంలో విహరించాల్సిన విమానం.. ఉన్నఫలంగా హైవేపై దర్శనమిచ్చింది. అది కూడా ఒక్కసారిగా పైనుంచి కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం కనిపించింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు.

అవును... మలేషియా హైవేపై ప్రైవేట్ జెట్ క్రాష్ అయ్యింది. దీని ప్రభావంతో భారీ పేలుడు సంభవించి.. మంటలు, దట్టమైన నల్లటి పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ప్రైవేట్ జెట్ లంకావి ద్వీపం నుండి కౌలాలంపూర్‌ కు పశ్చిమాన సెలంగోర్‌ కు వెళుతోంది. ఈ సమయంలో ఆ విమానంలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు.

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కలిపి మరో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. అవును... విమానం కూలిన హైవేపై ఆ సమయంలో ద్విచక్రవాహనంపై, కారులో వెళుతున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు సెలంగోర్‌ పోలీస్‌ చీఫ్‌ వెల్లడించారు.

సుబాంగ్‌ విమానాశ్రయంలో దిగాల్సిన ఈ ప్రైవేటు ఛార్టర్డ్‌ విమానం ల్యాండింగుకు కొద్ది నిమిషాల ముందు అదుపుతప్పి షా ఆలం జిల్లా హైవేపై కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.

అయితే మధ్యాహ్నం 2:47 నిమిషాలకు సుబంగ్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌ కు తాము ప్రమాదంలో ఉన్నట్లు విమానం నుంచి సందేశం వచ్చిందని.. ఆ తర్వాత 2:48కి ఎమర్జెన్సీ లాండింగ్‌ కు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వివరించారు. సిగ్నల్ ఇచ్చిన మూడు నిమిషాలకే అంటే... 2:51 నిమిషాల సమయంలో విమానం రహదారిపై కూలిందని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు విమానం బ్లాక్ బాక్స్ ను వెతుకుతున్నట్లు వెల్లడించారు.

మరోవైపు అమెరికాకు చెందిన ఓ పైలట్ ఇవాన్‌.. ప్రయాణిస్తున్న విమానంలోనే మరణించారు. బాత్ రూంకు వెళ్లిన పైలట్ హఠాత్తుగా అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన కో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినా... అప్పటికే ఆ పైలట్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటన సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 56 ఏళ్ల ఇవాన్‌ గత 25 ఏళ్లుగా పైలట్‌ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై లాటమ్‌ ఎయిర్‌ లైన్స్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.