Begin typing your search above and press return to search.

2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు చెబుతున్న పీకే!

బీహార్ సంగతి అలా ఉంటే... దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిశోర్.

By:  Tupaki Desk   |   30 Jan 2024 7:55 AM GMT
2024 లోక్  సభ ఎన్నికల ఫలితాలు చెబుతున్న పీకే!
X

జేడీ(యూ)చీఫ్‌ బిహార్‌ లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టడంపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్‌ కిషోర్‌.. బీహార్ లో జేడీయూ - బీజేపీ కూటమి స్థిరంగా ఉండదని.. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి 20కి మించి సీట్లు రావని తెలిపారు. ఇదే సమయంలో... కొత్తగా ఏర్పడిన బీజేపీ-జేడీ(యూ) కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదని అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో రాబోయే లోక్ సభ ఎన్నికల ఫలితాలపైనా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అవును... మహాకూటమి సీఎం పదవీ రాజీనామా చేసి.. ఎన్డీఏ కూటమి నుంచి మళ్లీ బిహార్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్‌ కుమార్‌ పై ప్రశాంత్‌ కిశోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... బిహార్‌ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఒక ఏడాది లేదా దాని కంటే తక్కువ కాలమే కొనసాగుతుంద.. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తి అయన కేవలం ఆరు నెలల్లోనే ఊహించినంత మార్పు సంభవిస్తుందని పీకే తెలిపారు.

బీహార్ సంగతి అలా ఉంటే... దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిశోర్. ప్రతిపక్ష కూటమికి సరైన నాయకుడు లేకపోవడం అనే అంశం అందులోని పార్టీలకు నష్టం చేకూరుస్తుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వచ్చే లోక్ సభ ఎన్నీకల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి 335 సీట్లవరకూ సాధిస్తుందని.. ఒక్క బీహార్ లోనే 40 సీట్లవరకూ దక్కుతాయని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో... ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు మాత్రం ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కనపడరని చెప్పారు. ఈ సందర్భంగా... నితీశ్ కుమార్ పచ్చి మోసగాడని ప్రశాంత్ కిశోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితంలో నితీశ్ చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నారని.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకి 20కి మించి సీట్లు రావని.. ఆయన ఏ కూటమితో జతకట్టినా ఇంతకు మించి సాధించలేరని చెప్పారు.

కాగా... బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం మైకులముందు మాట్లాడిన ఆయన... ప్రాణం పోయినా బీజేపీతో చేతులు కలపనని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విచిత్రంగా... ఈ వ్యాఖ్యలు చేసి రోజులు కూడా గడవక ముందే ఆయన బీజేపీతో జతకట్టారు. కొంతమంది నేతల మాటలు.. నీటిమీద రాతలు అంటే ఇదేనేమో!!