Begin typing your search above and press return to search.

పిఠాపురం వార్ : టైట్ ఫైట్ దిశగా...!

ఈసారి కచ్చితంగా లక్ష మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి అన్నది పవన్ ఆలోచనగా ఉంది.

By:  Tupaki Desk   |   19 April 2024 3:48 AM GMT
పిఠాపురం వార్ : టైట్ ఫైట్ దిశగా...!
X

ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ గా ఉన్న సీటు పిఠాపురం. ఎందుకు అంటే అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన కోరి మరీ ఎంపిక చేసుకున్న సీటు. ఈసారి కచ్చితంగా లక్ష మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి అన్నది పవన్ ఆలోచనగా ఉంది.

ఇంతకీ పిఠాపురంలో సీన్ ఎలా ఉంది. అక్కడ పవన్ ధీమా ఏంటి ఆయన గెలుపు కోసం పనిచేస్తున్న వారు ఎవరు అన్నది చూస్తే కనుక గత కొన్ని రోజులుగా పిఠాపురంలో మెగా బ్రదర్ నాగబాబు మకాం వేశారు. ఆయన గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తున్నారు.

ఉగాది శుభవేళ పవన్ కొత్తగా నివాసం ఉంటున్న దాంట్లోనే నాగబాబు కూడా చేరారు. అక్కడ నుంచి ఆయన పిఠాపురంలో పవన్ గెలుపు కోసం పధక రచన చేస్తున్నారు. జబర్దస్త్ టీం ని రప్పించారు వారితో డోర్ టూ డోర్ కాంపెయిన్ చేయిస్తున్నారు. అలాగే పార్టీ లో లీడర్స్ ని కోర్ ఆర్డినేట్ చేస్తూ వార్డుల వారీగా విభజించి మరీ బాధ్యతలు అప్పగించారు.

అదే విధంగా తెలుగుదేశం పార్టీతో కో ఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇపుడు ఏకంగా నాగబాబు రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన గొల్లప్రోలులో నిర్వహించిన రోడ్ షో లో పవన్ కి ఒక్క చాన్స్ ఇవ్వాలని జనాలను కోరారు. పవన్ కి చాన్స్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేయండి, పిఠాపురానికి ఆయన అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తారు అని నాగబాబు చెబుతున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రూపొందిస్తూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయమే లక్ష్యంగా నాగబాబు పనిచేస్తున్నారు. ఇక పిఠాపురంలో వైసీపీ కూడా చాలా ప్రతిష్టగా తీసుకుని పనిచేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వంగా గీత ఇప్పటికే రెండు సార్లు మొత్తం పిఠాపురాన్ని కలియతిరిగారు.

ఆమె స్థానికంగా ఉంటారు కాబట్టి అది ఆమెకు అడ్వాంటేజ్ గా ఉంటోంది. అందుబాటులో ఉన్న మహిళ, గతంలో ఒకసారి ఎమ్మెల్యే చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ఇలా వంగా గీతకు ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమెకు అండగా నిలిచి చేస్తున్న అండర్ గ్రౌండ్ ప్రచారం కూడా ఉపకరిస్తోంది. కాపులతో పాటుగా ఇతర సామాజిక వర్గం నేతలను కూడా కలుపుకుని పోవడంతో వైసీపీ ముందుంది అన్నది ఒక విశ్లేషణ.

ఇక పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటే మొత్తం ఓట్లు రెండు లక్షల ముప్పయి వేలుగా చెబుతున్నారు ఇక గతసారి అంటే 2019లో 83 శాతం పైగా పోల్ అయింది. ఈసారి అటూ ఇటూ పోటాపోటీగా ఉంది కాబట్టి పోలింగ్ శాతం 90 కి చేరువ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

ఇక పిఠాపురంలో ఉన్న కాపు ఓట్లు 90 వేల దాకా ఉన్నాయి. అయితే వంగా గీత పవన్ ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆ ఓట్లు పవన్ గీత చెరి సగం చీల్చుకున్నా మిగిలిన ఓట్లు మాత్రం చాలా కీలకం అవుతాయని అంటున్నారు.

అదేలా అంటే ఎస్సీ ఎస్టీ ఓట్లు 38 వేల దాకా ఉన్నాయి ఇందులో నూటికి ఎనభై శాతం వైసీపీకే అని ఆ పార్టీ భావిస్తోంది. అంటే దాదాపుగా ఇరవై వేల ఓట్లు అన్న మాట. అలాగే చేనేత సామాజిక వర్గం ఓట్లు 23 వేల దాకా ఉన్నాయి. ఇందులోనూ అధిక శాతం తమకే అని వైసీపీ లెక్కలేసుకుంటోంది. అంటే పదిహేను వేలు పై దాటి అన్న మాట.

ఇక మరో బీసీ సామాజిక వర్గం శెట్టి బలిజ ఓట్లు 27 వేలు దాకా ఉన్నాయి. ఇందులో కూడా మెజారిటీ తమకే అని వైసీపీ అంటోంది. అంటే ఇరవై వేల ఓట్లు అన్న మాట. ఇలా లెక్క వేస్తే వంగా గీతకు లక్ష ఓట్ల దాకా గ్యారంటీ అన్నది వైసీపీ అంచనా. అదే టైంలో పవన్ కి ఓట్లు అటూ ఇటూగా వచ్చినా తక్కువ మెజారిటీతో అయినా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నెగ్గుతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే టైట్ పొజిషన్ గానే పిఠాపురం ఉంది అని అంటున్నారు.