Begin typing your search above and press return to search.

పిఠాపురం వర్మ...తగ్గితేనే నెగ్గినట్టు !

పిఠాపురం వర్మ విషయం ఏపీలో ప్రతీ సారీ హాట్ టాపిక్ గా అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది.

By:  Satya P   |   23 April 2026 9:17 AM IST
పిఠాపురం వర్మ...తగ్గితేనే నెగ్గినట్టు !
X

పిఠాపురం వర్మ విషయం ఏపీలో ప్రతీ సారీ హాట్ టాపిక్ గా అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. పిఠాపురంలో ఏ కార్యక్రమం జరిగినా రెండు ప్రధాన పార్టీల మధ్యన ఐక్యత లేదన్న సందేశాన్ని సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతోంది. తాజాగా డ్వాక్రా మహిళలకు ట్యాబులను పంపిణీ చేసే కార్యక్రమంలో ప్రోటోకాల్ పేరుతో వర్మ ఆయన అనుచరులు పాడా ప్రాజెక్ట్ అధికారిని నిలదీయడం ప్రతిగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వర్గం అక్కడికి రావడంతో అది రాజకీయ సంఘర్షణ గా మారింది. చిలికి చిలికి గాలి వాన అయినట్లుగా వ్యవహారం ముదిరింది. ఆ మీదట పరస్పరం మీడియా ముందు సవాళ్ళు కూడా వర్మ అండ్ దొరబాబు చేసుకోవడంతో ఈ ఇష్యూ సోషల్ మీడియానూ ఊపేసింది. దాంతో టీడీపీ అధినాయకత్వం సీరియస్ అయింది అని అంటున్నారు.

డైలాగులతోనే వార్ :

పిఠాపురం వర్మలో తనకు తగిన పదవి దక్కలేదని ఆవేదన ఉంది. అసహనం కూడా ఉంది. అయితే అది సమయానుకూలంగా బయటపడుతోంది అని అంటున్నారు. పైగా ఆయన మంటెక్కించే డైలాగులతో జనసేన వర్సెస్ టీడీపీగా రచ్చ అవుతోందని అంటున్నారు. తాను బయట నుంచి వచ్చిన వాడిని కాదని దత్తత తీసుకోలేదని పిఠాపురంలోనే పుట్టాను అని వర్మ పదే పదే చెప్పడం స్థానికంగా ఎవరిని ఇబ్బంది పెట్టకపోయినా తగలాల్సిన వారికి తగులుతున్నాయని అంటున్నారు. పిఠాపురంలో పోటీ చేసింది గెలిచింది ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పైగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పిఠాపురం వాసి కాదు అని పదే పదే అన్నట్లుగానే ఈ డైలాగులు ఉన్నాయని అంటున్నారు. ఇక ప్రోటోకాల్ విషయంలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వారిదే ఆధిపత్యంగా ఉంది కదా అని అంటున్నారు.

నిన్న పదవి ఇచ్చినా :

ఇక నిన్నటికి నిన్ననే వర్మకు టీడీపీ అధినాయకత్వం పదవి ఇచ్చింది. ఆయన్ని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేశారు. దాంతో రానున్న రోజులల్లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి అయినా లేదా మరేదైనా పోస్టు అయినా దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ వర్మ దూకుడుతో మళ్లీ మొదటికే మోసం వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ అధినాయకత్వం అయితే ఈ వ్యవహారం మీద సీరియస్ గా ఉంది అన్న వార్తలతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని పిఠాపురంలో ఏమి జరుగుతోందో చూడమని అవసరమైన క్రమశిక్షణ చర్యలకు కూడా దిగాలని అధినాయకత్వం ఆదేశించింది అన్న వార్తల నేపధ్యంలో వర్మ రాజకీయ దూకుడు ఏ రకమైన పర్యవసానాలకు దారి తీస్తుంది అన్న చర్చ అయితే సాగుతోంది.

కూటమి జాగ్రత్తలు :

ఏపీలో ఎక్కడ ఏమి జరిగినా అది మొత్తం కూటమి పార్టీల మధ్యన గ్యాప్ పెంచేదిగా ఉంటుందని భావిస్తున్నారు. దాంతోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. వర్మ విషయం తీసుకుంటే సీనియర్ నాయకుడిగా ఆయన ఉన్నారు. అయితే రాజకీయంగా జోరు చేసే క్రమంలో ఆయన చేస్తున్న హాట్ కామెంట్స్ ఒక్కోసారి ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన హితైషులు ఒక సూచన చేస్తున్నారు. అత్తారింటికి దారేది మూవీలో పవన్ చెప్పినట్లుగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆలోచించి వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని కోరుతున్నారు. మరి ఫైర్ బ్రాండ్ కి మారు పేరు అయిన వర్మ వింటారా లేదా అన్నదే చూడాల్సి ఉంది.