Begin typing your search above and press return to search.

వర్మ విత్ పవన్...షేక్ హ్యాండ్ తో షేక్ చేశారు

పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయ యుద్ధం హై రేంజిలో సాగుతోంది అని మీడియా కధనాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 April 2025 1:55 PM
వర్మ విత్ పవన్...షేక్ హ్యాండ్ తో షేక్ చేశారు
X

పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయ యుద్ధం హై రేంజిలో సాగుతోంది అని మీడియా కధనాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. టీడీపీ ఇంచార్జిగా ఉన్న ఎస్వీఎస్ ఎన్ వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని టీడీపీ శ్రేణులు ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నాయి. అదే సమయంలో నాగబాబుకు ఎమ్మెల్సీ దక్కడం పట్ల గారు అంతా గుర్రుగా ఉన్నారు.

అది ఆ మధ్యన నాగబాబు పిఠాపురం పర్యటనలో స్పష్టంగా కనిపించింది. ఈ పర్యటనకు వర్మ దూరంగా ఉన్నారు. ఇక టీడీపీ శ్రేణులు అయితే నాగబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ నిరసన గళం వినిపించాయి. ప్రతిగా జనసేన నుంచి కూడా అంతే స్తాయిలో నినాదాలు వచ్చాయి.

వీటిని చూసిన వారు ఇక పిఠాపురం కూటమిలో మంటలే అని అనుకున్నారు. అయితే అదంతా టీ కప్పులో తుఫాను మాదిరిగా చెదిరిపోయింది. ఒక్క దెబ్బకు ఈ ఊహాగానాలకు చెక్ పెట్టేసారు పిఠాపురం వర్మ. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంట వర్మ ఉండడంతో అందరూ విస్మయం వ్యక్తం చేయాల్సి వచ్చింది. అంతే కాదు విభేదాలు వట్టి ఊహాగానాలు మాత్రమే అనుకోవాల్సి వచ్చింది.

పిఠాపురం వర్మకు పవన్ ఇస్తున్న గౌరవం మర్యాద కూడా ఈ టూర్ లో స్పష్టంగా కనిపించింది. అభివృద్ధి శిలా ఫలకం వద్ద ఒక వైపు పవన్ ఉంటే మరో వైపు వర్మ ఉన్నరు. అలాంటి సన్నివేశాన్ని చూసిన వారు ఎవరురా విభేదాలు ఉన్నది అన్నది అని ప్రశ్నించుకోకుండా ఉండలేరు.

ఇంకో వైపు చూస్తే కనుక వర్మ చంద్రబాబు పట్ల కూడా అదే విధమైన గౌరవ భావాన్ని చూపిస్తున్నారు. ఈ మధ్యనే విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో బాబు తో షేక్ హ్యాండ్ ఇస్తూ వర్మ కనిపించారు. ఇక తాజాగా చూస్తే కనుక పవన్ వర్మ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కనిపించారు.

మేమంతా ఒక్కటే అన్న దానిని రెండు పార్టీలకు ఇస్తున్న సందేశంగా అంతా చూస్తున్నారు. వర్మ అయితే తనకు పదవులు రాకపోవడానికి కూటమి పెద్దన్నగా చంద్రబాబుకు ఉన్న అనివార్యతలు కారణం అని భావిస్తున్నారు. బాబు మీద ఎన్నో ఒత్తిడులు ఉంటాయని కూడా ఆయన సానుకూలంగానే ఆలోచిస్తున్నారు తప్ప ఒక్క వ్యతిరేక విమర్శ చేయలేదు.

అంతే కాదు పవన్ విషయంలో కూడా వర్మ ఏ రోజూ పెద్దగా వ్యతిరేక విమర్శలు చేసినది లేదని అంటున్నారు. ఈ నేపధ్యంలో వర్మ పవన్ ల మధ్య ఆ సుహృద్భావ వాతావరణాన్ని చూసిన వారు అంతా పిఠాపురంలో కూటమికి మంచి రోజులు వచ్చాయనే అనుకుంటున్నారు. పవన్ కూడా పెద్ద మనసు చేసుకుని అందరికీ కలుపుకుని పోతున్నారు అని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలు మాత్రం పిఠాపురం పాలిటిక్స్ ని కొత్త టర్న్ దిశగా చేరుస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా పిఠాపురం పాలిటిక్స్ స్పెషాలిటీయే వేరు అని అంటున్నారు అంతా.