అజ్ఞాత దుష్ట శక్తి...పిఠాపురం...గరం గరం
పిఠాపురం పాలిటిక్స్ మరో మారు వేడెక్కాయి. పిఠాపురం నిజానికి 2024 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయ తెర మీదకు ఎక్కువగా చర్చకు వస్తోంది
By: Tupaki Desk | 22 April 2025 8:58 PM ISTపిఠాపురం పాలిటిక్స్ మరో మారు వేడెక్కాయి. పిఠాపురం నిజానికి 2024 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయ తెర మీదకు ఎక్కువగా చర్చకు వస్తోంది. ఎందుకు అంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, ఉప ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉండడం వల్ల వచ్చిన పొలిటికల్ గ్లామర్ గా చూడాల్సి ఉంది.
మరో వైపు చూస్తే కనుక పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పవన్ గెలిచిన కొత్తల్లో నేం ప్లేట్స్ మార్చేసి జనసైనికులు పవన్ అభిమానులు రాష్ట్రమంతా తిరిగి సంబరాలు చేశారు. అలా పిఠాపురం మారుమోగింది. అయితే అక్కడ టీడీపీ బలంగా ఉంది, జనసేన అడ్డా అంటోంది. దాంతో రాజకీయ ఘర్షణ కూటమిలో చెలరేగుతోంది.
అదే విధంగా చూస్తే ఆధిపత్య పోరు కూడా ఎక్కువగా ఉంది. పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ ఎన్ వర్మ ఒక వైపు జనసేన నాయకులు మరో వైపు నిలుచుకుని అక్కడ రాజకీయాన్ని వేడెక్కిస్తున్న సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ప్రతీ చిన్న సంఘటనకూ రాజకీయ రంగు అద్దుతున్నారు.
తాజాగా చూస్తే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం వద్ద దళితులపై సామాజిక బహిష్కరణ జరిగింది. విద్యుత్ షాక్ కారణంగా దళిత యువకుడు మరణించారు. ఈ ఘటన జరిగి కొద్ది రోజులు అయింది. మరి అనంతర పరిణామాలలో ఈ బహిష్కరణ జరిగింది. ఈ నెల 16న ఒక సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి చెందిన ఇంట్లో ఎలక్ట్రికల్ పని పనిచేస్తుండగా దళిత యువకుడు విద్యుదాఘాతంతో మరణించాడు.
చివరికి ఇది గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. దీని ఫలితంగా దళితులను సామాజికంగా బహిష్కరించే దాకా వ్యవహారం వెళ్ళింది. ఐతే జిల్లా కలెక్టర్ ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. అయితే దీని మీద రాజకీయ రచ్చ సాగుతోంది.
అజ్ఞాత దుష్ట శక్తుల వల్లనే ఇదంతా అని జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడుతూ దళితుల బహిష్కరణ వెనక అజ్ఞాత శక్తి ఉందని ఆరోపించారు. ఆ దుష్ట శక్తి ఎవరో రానున్న రోజులలో బయటపడుతుందని అంటున్నారు.
దీంతో ఎవరా దుష్ట శక్తి అన్న చర్చ సాగుతోంది వైసీపీ వారు అయితే ఈ పాటికే పేరు బయటకు చెబుతారు కదా అని అంటున్నారు. మరి అజ్ఞాతంలో ఉన్న దుష్ట శక్తి ఎవరో చెప్పకుండా జనసేన నాయకుడు ఒక విమర్శ చేసి వదిలారు. దాంతో ఇపుడు ఆ మాటలే మరింత అగ్గి రాజేస్తున్నాయి.
ఇంకో వైపు చూస్తే దళితుల మీద సామాజిక బహిష్కరణను వామపక్ష పార్టీలు ఖండించాయి. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ గ్రామాన్ని సందర్శించి దళితులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని కూడా సీపీఐ, సీపీఎం పార్టీలు డిమాండ్ చేశాయి.
