పిఠాపురం...కూటమి ఏం చేస్తుంది ?
పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు కచ్చితంగా ఎమ్మెల్సీ దక్కుతుందని భావించారు. కానీ పది నెలల రాజకీయం చూస్తే వర్మను సైడ్ లైన్ లో చేస్తున్నారు అన్న భావన అయితే ఆయనతో పాటు టీడీపీకి కూడా వచ్చింది.
By: Tupaki Desk | 6 April 2025 10:58 AM ISTఏపీలో ఇపుడు హాట్ టాపిక్ గా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. నిజానికి ఇప్పటిదాకా ఈ నియోజకవర్గం ఎపుడూ అంతగా చర్చలోకి వచ్చేది కాదు. అక్కడ ఎవరు ఎమ్మెల్యే అన్నది కూడా తెలిసేది కాదు. అయితే 2024 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసినది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
అలా ఆయన సినీ ఇమేజ్ తో పాటు రాజకీయంగా బలమైన సామాజిక వర్గం దన్నుతో పిఠాపురం అన్నది ఏపీలో వీఐపీ సీటుగా ముందుకు వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయిపోయారు.
ఇక పిఠాపురంలో జనసేన నేతల జోష్ ఒక లెవెల్ లో ఉంది. సహజంగానే తమ నాయకుడు ఉన్నత పదవులు అందుకుంటే క్యాడర్ కి లోకల్ లీడర్ కి ఎంతో సంబరం. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. దాంతో వారంతా యమ జోరుగా ఉన్నారు. సరిగ్గా అదే టీడీపీకి ఇబ్బందిగా మారింది. పిఠాపురం టీడీపీకి కూడా కంచుకోట లాంటి సీటు.
ఆ పార్టీ సైతం అనేక ఎన్నికల్లో గెలిచి వచ్చింది. పైగా పిఠాపురంలో బలమైన నాయకుడుగా ఎస్వీఎ ఎన్ వర్మ ఉన్నారు. నిజానికి సామాజిక వర్గాల పరంగా చూస్తే అది సాధ్యం కాదు కానీ ఆయన తన సమర్థతతో పనితీరుతో మంచితనంతో దశాబ్దాలుగా ప్రజలఒతో పెనవేసుకున్న అనుబంధంతో ఆ పట్టు సాధించారు.
పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు కచ్చితంగా ఎమ్మెల్సీ దక్కుతుందని భావించారు. కానీ పది నెలల రాజకీయం చూస్తే వర్మను సైడ్ లైన్ లో చేస్తున్నారు అన్న భావన అయితే ఆయనతో పాటు టీడీపీకి కూడా వచ్చింది. పైగా పుండు మీద కారం జల్లినట్లుగా వర్మకు బదులుగా అన్నట్లు నాగబాబుకు ఆ పదవి ఇచ్చారు. పైగా ఆయననే పిఠాపురం తెచ్చి పవన్ ని బదులుగా అధికార పెత్తనాలు అప్పగిస్తున్నారు.
దీంతో వర్మ వర్గం ఒక్క లెక్కన రగిలిపోతోంది. నిజం చెప్పాలీ అంటే వర్మ ఈ రోజుకీ సహనంతోనే ఉన్నారని అంటున్నారు. ఆయన తనకు ఎమ్మెల్సీ సీటు దక్కకపోయినా మీడియా ముందు జాగ్రత్తగా మాట్లాడారు అనేక సమీకరణలు ఉంటాయి. అధినాయకత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా అని క్యాడర్ కి సర్దిచెప్పారు.
ఇక ఆయన పర్యటనలలో ఎక్కడా జనసేనను తక్కువ చేయడం లేదు పైగా తన ఫ్లెక్సీలలో పవన్ ఫోటోని పెట్టుకునే వెళ్తున్నారు. ఆ మాటకు వస్తే వర్మకు పవన్ తో ఏమీ లేదని అంటారు. లోకల్ క్యాడర్ తోనే టీడీపీకి విభేదాలు ఉన్నాయి. అలాగ వర్మకు కూడా లోకల్ లీడర్స్ తోనే ఉంది తంటా అని అంటున్నారు.
దానిని అర్ధం చేసుకుని మొదట్లోనే పరిష్కారాలు చూపించి ఉంటే బాగుండేది. కానీ అలా జరగడం లేదు, పైగా అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. దీని వల్ల కూటమి ఐక్యత పిఠాపురంలోనే భగ్నం కాదని ఇది ఒక ఉదాహరణగా చేసుకుని అన్ని చోట్లా పాకుతుందని అంటున్నారు.
వర్మ వంటి నిబద్ధత కలిగిన లీడర్ విషయంలో టీడీపీ అధినాయకత్వం ఎలా వ్యవహరిస్తుంది అన్నది కూడా మొత్తం పార్టీ క్యాడర్ చూస్తోంది అని చెబుతున్నారు. పొత్తులు ఉన్నా కూడా తమ పార్టీని తమ నాయకులను సైతం కాపాడుకోవాలి కదా అన్న చర్చ ఉంది.
టీడీపీ అధినాయకత్వం వర్మకు సరైన పొజిషన్ ఇచ్చి పిఠాపురంలో ఆయనతో పాటు టీడీపీ జెండాను కూడా నిలబెట్టాలని అంతా కోరుకుంటున్నారు. అదే సమయంలో వర్మకు ప్రయారిటీ ఇచ్చినా పొలిటికల్ గా టాల్ ఫిగర్ అయిన పవన్ కి కానీ జనసేనకు కానీ వచ్చిన ఇబ్బంది కూడా లేదని అంటున్నారు. అలా కాకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తే మాత్రం కూటమికి పొలిటికల్ గా స్ట్రోక్ ఇక్కడ నుంచే ఉండొచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా పిఠాపురం టఫ్ టాస్క్ గా మారిగా లేక చేసుకున్నారా అంటే రెండింటిలోనూ నిజం ఉంది అని అంటున్నారు.
