పల్నాడు జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోదరులకు అరెస్టు ముప్పు
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
By: Tupaki Desk | 29 Aug 2025 2:31 PM ISTపల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతల హత్య కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిలు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆర్థికంగా రాజకీయంగా బలవంతులైన పిన్నెల్లి సోదరులకు బెయిలు మంజూరు చేస్తే, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని, దర్యాప్తుపై ప్రభావితం చూపే నిర్ణయం తీసుకోవద్దని ప్రాసిక్యూషన్ వాదనను హైకోర్టు అంగీకరించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామచంద్రారెడ్డికి అరెస్టు ముప్పు ఉందని ప్రచారం జరుగుతోంది.
పల్నాడులోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన సోదరులు, టీడీపీ నేతలు అయిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటీశ్వరరావు హత్య కేసులో పిన్నెల్లి సోదరులు అనుమానితులుగా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లితో సంబంధాలు ఉన్నాయని, హత్యలను ప్రోత్సహించారనే కారణంగా పిన్నెల్లి బ్రదర్స్ ను నిందితులుగా పేర్కొన్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.
ప్రత్యక్ష సాక్షి, హతుడి బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు నిందితులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు అయింది. ఇందులో ఏ1గా హతుడి బంధువు జవిశెట్టి శ్రీను అలియాస్ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై అభియోగాలు నమోదు అయ్యాయి. టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్యలో పిన్నెల్లి బ్రదర్స్ పాత్రపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదించింది.
‘‘హత్యల వెనుక కుట్ర, పిన్నెల్లి సోదరుల ప్రోద్బలం ఉంది. అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని’’ ప్రాసిక్యూషన్ తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఆగస్టు 21న హైకోర్టులో వాదనలు జరగగా, తీర్పును రిజర్వు చేస్తూ హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పు వెల్లడిస్తూ పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిలు పిటిషన్లు కొట్టివేస్తూ నిర్ణయం ప్రకటించింది. సర్పంచ్ పదవికి పోటీ చేస్తే తాము మద్దతిస్తామని ఏ1 జవిశెట్టి శ్రీనుకు పిన్నెల్లి సోదరులు రెచ్చగొట్టారని, నిందితులు ఓ రెస్టారెంటులో కూర్చొని హత్యకు పథకం రచించడంతోపాటు పిన్నెల్లి సోదరులతో ఫోన్ లో మాట్లాడినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక, ఫోన్ రికార్డులు తమ వద్ద ఉన్నాయని ప్రాసిక్యూషన్ చెప్పడంతో నిందితుల ముందస్తు బెయిలు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
