Begin typing your search above and press return to search.

ఈ రోజే పింక్ మూన్.. అస్సలు మిస్ కావొద్దు

చిన్నప్పటి అమ్మ గోరుముద్దలు తినే వేళలో.. ఆకాశంలో ఉండే తెల్లటి బంతిని చూపిస్తూ అమ్మ చెప్పే ముచ్చట్లు ఇప్పటి తరానికి కష్టమే.

By:  Tupaki Desk   |   13 April 2025 5:38 AM
Watch the Pink Moon Light Up the Indian Skies
X

ఆకాశంలో సదూర ఉన్న చందమామతో మనిషికి ఉండే అనుబంధం అంతా ఇంతా కాదు. చిన్నప్పటి అమ్మ గోరుముద్దలు తినే వేళలో.. ఆకాశంలో ఉండే తెల్లటి బంతిని చూపిస్తూ అమ్మ చెప్పే ముచ్చట్లు ఇప్పటి తరానికి కష్టమే. నలభై ఏళ్ల క్రితం పుట్టినోళ్లకు అంతా ఇంతో అవకాశం ఉంటుంది. సాంకేతిక విప్లవం మనిషికి ఎన్నో సౌకర్యాల్ని తీసుకొచ్చింది. అదే సమయంలో ప్రకృతి నుంచి దూరం చేసింది. కాంక్రీట్ జంగిల్ లో బతికేస్తూ.. చేతిలో ఇమిడే ఫోన్ లోనే ప్రపంచాన్ని చూస్తూ కాలం గడిపే పాడు రోజులు వచ్చేశాయి.

ఇలాంటి సమయాల్లోనూ ఆకాశంలో అందరికి కనిపించే అద్భుతాల పుణ్యమా అని.. మరోసారి మూలాల్లోకి వెళ్లే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు అలాంటి అద్భుతమే ఈ రోజు (ఆదివారం) ఆకాశంలో ఆవిష్క్రతం కానుంది. అసలే ఆదివారం. అందునా ఆకాశంలో చందమామ పింక్ మూన్ గా కన్పించనున్నాడు. వసంతకాలంలో వచ్చే మొదటి పౌర్ణమిని పింక్ మూన్ గా పిలుస్తుంటారు.

ఎప్పుడూ కనిపించే చంద్రుడు ఈ రోజు పింక్ రంగంలోకి ఎలా మారతాడన్న సందేహం అక్కర్లేదు. అద్భుతం చందమామలో కాదు.. వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా ఇలాంటి పరిస్థితి. పింక్ మూన్ వేళ చంద్రుడు లేత గులాబీ రంగులో మసగ్గా కనిపిస్తాడు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగానే భూమిపై నుంచి చూస్తే చంద్రుడు లేత గులాబీ రంగులో కనిపిస్తాడు.

కొందరు దీన్ని పింక్ మూన్ అని.. మరికొందరు సూపర్ మూన్.. ఫిష్ మూన్.. గ్రాస్ మూన్ ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. ఇంతకూ దీనికి పింక్ మూన్ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే దీనికో కారణం ఉంది. ఉత్తర అమెరికాలో వసంతకాలంలో ఫాక్స్ సుబులాట అనే పుష్పాలు వికసిస్తాయి. అవి గులాబీ రంగులో ఉంటాయి. అదే సమయంలో ఆకాశంలో చంద్రుడు కూడా లేత గులాబీ రంగులో కన్పించటంతో దీన్ని పింక్ మూన్ అని పిలవటం పరిపాటిగా మారింది.

ఈ పింక్ మూన్ ను చూడాలంటే కాలుష్య వాతావరణం ఎక్కువగా ఉండే మహా నగరాల్లో పెద్దగా కనిపించకపోవచ్చు. బీచ్ లు.. తక్కువ కాంతి.. కాలుష్యం లేని ప్రాంతాల్లో పింక్ మూన్ ను చూడొచ్చు. భారత్ లో ఏప్రిల్ 13 ఉదయం తెల్లవారుజామున 3.21 గంటల నుంచి 5.51 గంటల మధ్యలో చూడొచ్చు. వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా.. పింక్ మూన్.. రెడ్ మూన్.. బ్లూ మూన్ లాంటివి అప్పుడప్పుడు కన్పిస్తాయి. ఇప్పుడు పింక్ మూన్ వంతుగా చెప్పాలి.