Begin typing your search above and press return to search.

వెనక్కి తగ్గని పిల్లి.. మరోమారు హాట్‌ కామెంట్స్‌!

ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటోంది

By:  Tupaki Desk   |   29 Aug 2023 6:22 AM GMT
వెనక్కి తగ్గని పిల్లి.. మరోమారు హాట్‌ కామెంట్స్‌!
X

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో మరోమారు అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.. వైసీపీ. పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ అయితే 175కి 175 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యమే నిర్దేశించుకున్నారు. ఈ దిశగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య సిగపట్లు తప్పడం లేదు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికి మించి ఇద్దరు ముగ్గురు బలమైన అభ్యర్థులు ఉన్నచోట.. వారు కూడా పార్టీ టికెట్‌ ఆశిస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.

ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటోంది. రామచంద్రాపురం నియోజకవర్గంలో టికెట్‌ కోసం ఏకంగా ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పుడు రామచంద్రాపురం ఎమ్మెల్యేగా శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఈయన జగన్‌ మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖల మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరోవైపు రామచంద్రాపురంలో గతంలో పలుమార్లు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన 2019లో మండపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో కొనసాగుతుండటంతో జగన్‌ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాజీనామా చేయించి రాజ్యసభకు పంపారు.

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కూడా శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందినవారే. రామచంద్రాపురంలో తన అనుచరులు, సన్నిహితులను చెల్లుబోయిన వేణు అణగదొక్కుతున్నారని పిల్లి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి పిల్లికి, చెల్లుబోయినకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

దీంతో వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సూర్యప్రకాష్‌ రామచంద్రాపురం నుంచి పోటీ చేస్తారని పిల్లి ఇటీవల ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ ను సీటు కోసం అడుగుతామని.. సీటు ఇవ్వని పక్షంలో రామచంద్రాపురం నుంచి తాను లేదా తన కుమారుడు ఇండిపెండెంట్‌ గా పోటీ చేస్తామని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బహిరంగంగా ప్రకటించారు.

ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లోనూ రామచంద్రాపురం సీటు తనదేనని చెల్లుబోయిన వేణు ప్రకటించారు. అంతేకాకుండా తాను బ్రతికి ఉన్నంతవరకు ఆ సీటు తనదేనన్నారు. దీంతో పిల్లి, చెబ్లుబోయిన మధ్య విభేదాలు మరింత పెరిగాయి.

ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ అటు పిల్లిని, ఇటు చెల్లుబోయినను తాడేపల్లికి పిలిపించి సయోధ్య కుదిర్చారు. మళ్లీ ఇంతలోనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడం మొదలుపెట్టారు.

ఈ క్రమలో తాజాగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచంద్రాపురంలో పోటీ చేసేది తన కుమారుడేనని తెలిపారు. తాజాగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పిల్లి ఈ మేరకు వ్యాఖ్యానించారు. త్వరలోనే తన కుమారుడు సీఎం వైఎస్‌ జగన్‌ తో భేటీ అవుతారన్నారు. కార్యకర్తల అభీష్టాన్ని సీఎంకు తెలుపుతాడని వెల్లడించారు. సీఎం నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందన్నారు. తమ కుమారుడిని ఆశీర్వదించాలని కార్యకర్తలను కోరారు. మరి సీఎం జగన్‌ రామచంద్రాపురం సమస్యను ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాల్సిందే.