Begin typing your search above and press return to search.

పావురం తెచ్చిన సందేశం.. సరిహద్దుల్లో హైఅలర్ట్...

ఇరు దేశాల మధ్య ఏదైనా ఒప్పందాలు, ఉమ్మడిగా ఏవైనా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ప్రేమ, శాంతికి చిహ్నాంగా పావురాలను ఎగువేస్తుంటారు.

By:  Tupaki Desk   |   21 Aug 2025 1:33 PM IST
పావురం తెచ్చిన సందేశం.. సరిహద్దుల్లో హైఅలర్ట్...
X

ఇరు దేశాల మధ్య ఏదైనా ఒప్పందాలు, ఉమ్మడిగా ఏవైనా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ప్రేమ, శాంతికి చిహ్నాంగా పావురాలను ఎగువేస్తుంటారు. అలాగే భారత దేశంలో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా పావురాలను ఎగురవేస్తుంటారు. ఒకప్పుడు రాజుల కాలంలో ఈ పావురాలు ప్రేమ సందేశాలను తెచ్చేవి. కాలం మారింది. ఇప్పుడవి ఇంట్లో పెట్స్ గా మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయాలు. కానీ శాంతి, ప్రేమకు చిహ్నమైన పావురంతో డేంజరస్ వార్నింగ్ పంపారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో ఒక్కసారిగా బీఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. జమ్మూలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

భద్రతా సిబ్బందికి చిక్కిన పావురం

పాకిస్తాన్‌ వైపు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్న ఓ పావురం జమ్మూలో కలకలం రేపింది. బీఎస్ఎఫ్‌ సిబ్బంది సరిహద్దు ప్రాంతంలో రాత్రి గస్తీ చేస్తుండగా ఈ పావురాన్ని పట్టుకున్నారు. దాని కాలి దగ్గర రబ్బర్‌ బ్యాండ్‌తో ఒక కాగితం కట్టి ఉండడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు.

భయానక సందేశాలు

భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న పర్చీ సాధారణ కాగితం ముక్క, కానీ దానిపై ఉర్దూ, ఇంగ్లీషులో చేతిరాతలో సందేశాలు రాసి ఉన్నాయి. వాటిలో “కశ్మీర్‌ మాది”, “వక్త్ ఆగయా హై” అని రాశారు. “జమ్మూ స్టేషన్‌ ఐఈడీ బ్లాస్ట్” అనే పదాలు రాసి ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

భద్రతా సంస్థలు అలర్ట్‌

పావురం, పర్చీని స్వాధీనం చేసుకున్న తర్వాత బీఎస్ఎఫ్‌ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. స్థానిక పోలీసు, రైల్వే రక్షణ దళం, గూఢచార విభాగాలు సైతం హెచ్చరికలోకి వెళ్లాయి. జమ్మూ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పర్చీపై వాడిన సిరా, కాగితం మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

పాత పద్ధతులే వినియోగం

గూఢచారి సంస్థల అభిప్రాయం ప్రకారం, సాంకేతిక నిఘా నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాద సంస్థలు మళ్లీ పావురాల ద్వారా సందేశాలు పంపించే పాత పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తు్న్నారు. గతంలో కూడా పావురాల రెక్కలు, కాళ్లకు కట్టిన కోడ్‌ పదాలు, సంఖ్యలు అనేకసార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మళ్లీ సరిహద్దు భద్రతపై కొత్త ఆందోళనలు ఉత్పన్నమయ్యాయి.