Begin typing your search above and press return to search.

ట్యాపింగ్ బిగ్ బాస్ ఎవరు? తాజా విచారణ ఏం చెబుతోంది?

ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని సరైన రీతిలో విచారణ జరిపితే.. ఫోన్ ట్యాపింగ్ బిగ్ బాస్ ఎవరన్న విషయంపై మరింత క్లారిటీ రావటం ఖాయమంటున్నారు.

By:  Tupaki Desk   |   2 April 2024 4:04 AM GMT
ట్యాపింగ్ బిగ్ బాస్ ఎవరు? తాజా విచారణ ఏం చెబుతోంది?
X

కొద్ది నెలలుగా సంచలనంగా మారి ఇటీవల కాలంలో తరచూ పత్రికల పతాక శీర్షికల్లోకి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం. కొన్ని రాజకీయ పార్టీలు.. కొందరు రాజకీయ ప్రముఖులే లక్ష్యంగా.. వారిని దెబ్బ తీయటమే ప్రధాన టాస్కుగా నిర్వహించిన ఫోన్ ట్యాపింగ్ పాపం బద్దలైంది. రోజు రోజుకు ఈ కేసు పరిధి పెరుగుతోంది. కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో మొదట్నించి వినిపిస్తున్న రిటైర్డు ఐజీ (ఎస్ఐబీ) ప్రభాకర్ రావు పేరు ఇప్పుడు కన్ఫర్మ్ కావటమే కాదు.. ఆయన చుట్టూనే ట్యాపింగ్ వ్యవహారం నడిచిందన్న వాదనకు బలం చేకూరే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

గత వారం అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్ ఫఓర్సు డీసీపీగా.. ఓఎస్డీగా పని చేసిన రాధాకిషన్ రావు విచారణలో సంచలన అంశాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారిలో రాధాకిషన్ రావు కీలక బాధ్యతల్ని నిర్వహించిన పోలీసు అధికారి. తాజాగా ఆయన వాంగ్మూలంలో నాటి ఐజీ ప్రభాకర్ రావు పేరును వెల్లడించటమే కాదు.. ఆయన ఆదేశాలతో తామేం చేశామన్న అంశానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించటంతో సంచలన అంశాలు వెలుగు చూశాయి.

2014లో తొలిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం (టీఆర్ఎస్ సర్కార్) కొలువు తీరిన తర్వాత సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా 2016లో ప్రభాకర్ రావును నిఘా విభాగానికి బదిలీ చేసింది. అనంతరం ప్రభాకర్ రావు తన సామాజిక వర్గానికి చెందిన (వెలమ) అధికారులతో పాటు గతంలో తనతో కలిసి పని చేసిన వారిలో కొందరిని నిఘా విభాగంలోని వేర్వేరు ఉప విభాగాల్లో నియమించారు. ప్రభాకర్ రావు సూచనల మేరకు హైదరాబాద్ నగరంలో రాజకీయంగా ఇతరత్రా పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ అధినాయకత్వం 2017లో టాస్క్ ఫోర్సు డీసీపీగా తనకు అవకాశాన్ని ఇచ్చినట్లుగా రాధాకిషన్ రావు స్వయంగా ఒప్పుకోవటం గమనార్హం.

తన సూచనతోనే గట్టుమల్లును పశ్చిమ మండలం టాస్క్ ఫోర్సు సీఐగా ప్రభుత్వం నియమించిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అక్కడే రెండేళ్ల పాటు పని చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాతి రోజుల్లోనూ అధికారంలోనే ఉండేలా తన సూచన మేరకు గట్టుమల్లును ప్రభాకర్ రావు ఎస్ఐబీలోకి తీసుకున్నట్లుగా రాధాకిషన్ రావు వెల్లడించారు. ఆ తర్వాత నుంచి తెలంగాణలో బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్) పార్టీ బలోపేతం చేయటానికి వీలుగా ఆ పార్టీ పాలన కొనసాగేలా చూసేందుకు ప్రభాకర్ రావు.. భుజంగరావు.. వేణుగోపాలరావు.. ప్రణీత్ రావులు తరచూ సమావేశమయ్యేవారు.

తమ అనధికారిక కార్యకలాపాలు బయటకు పొక్కకుండ ఉండేందుకు వాట్సాప్.. సిగ్నల్.. స్నాప్ చాట్ లాంటి సోషల్ మీడియా మాథ్యమాల ద్వారా మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్న విషయాన్ని రాధాకిషన్ రావు తన విచారణలో అంగీకరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎలాగైనా మళ్లీ అధికారంలోకి తీసుకురావటంతో పాటు..పార్టీపై అధినేతకు పూర్తి అజమాయిషీ ఉండేలా చూడటమే తమ లక్ష్యమని ప్రభాకర్ రావు టీం భావించినట్లుగా పేర్కొన్నారు.

ఇందులో భాగంగా ప్రతిపక్ష నాయకులు.. వారి అనుచరులు.. కుటుంబ సభ్యులు.. వ్యాపారులు.. బీఆర్ఎస్ అసమ్మతి వర్గీయులతో పాటు అదే పార్టీలో అనుమానాస్పదంగా ఉండే నేతల కార్యకలాపాలపైనా నిఘా పెట్టినట్లుగా రాధాకిషన్ రావు వెల్లడించారు. దీంతో.. ప్రభాకర్ రావు చుట్టూనే ట్యాపింగ్ అంశం నడిచిందన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడి నుంచే అసలు సంగతి షురూ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కథ మొత్తాన్ని నడిపించిన విషయం వెల్లడైంది. మరి.. ఆయన ఈ పని చేయటానికి కారణం ఏమిటి? ఆయన వెనకున్న బిగ్ బాస్ ఎవరు. అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని సరైన రీతిలో విచారణ జరిపితే.. ఫోన్ ట్యాపింగ్ బిగ్ బాస్ ఎవరన్న విషయంపై మరింత క్లారిటీ రావటం ఖాయమంటున్నారు.