ఇంతకీ మృత్యువెక్కడ ?
మనిషి జీవితంలో మరచిపోవాలనుకునేది చావు గురించే. జీవితం మొత్తం అందమైన అబద్ధంగా లాగించేస్తూ అసలైన నిజం మరణాన్ని దాచేస్తూ ముందుకు సాగిపోవడమే మానవ నైజం.
By: Satya P | 12 July 2026 6:48 PM ISTమనిషి జీవితంలో మరచిపోవాలనుకునేది చావు గురించే. జీవితం మొత్తం అందమైన అబద్ధంగా లాగించేస్తూ అసలైన నిజం మరణాన్ని దాచేస్తూ ముందుకు సాగిపోవడమే మానవ నైజం. చావు గురించి మనిషికి ఒక నిశ్చితాభిప్రాయం ఉంది. అది తన దగ్గరకు రాదు, దానికి ఆ ధైర్యం లేదు. అది తనను ఏమీ చేయలేదు అని. ఎందుకంటే ఈ ఆలోచనలు చేసే మనిషి జీవిస్తూనే ఉన్నాడు కాబట్టి అలాంటి ఆలోచనలే చేయగలుగుతాడు. అంతే కాదు ఎన్నో విషయాల గురించి చాలా ఆసక్తిగా తెలుసుకోవాలనుకునే మనిషి మృత్యువు గురించి మాత్రం అసలు వినాలనుకోడు, తెలుసుకోవాలనుకోడు, అంతే కాదు అసలు పట్టించుకోనట్లుగా ఉంటాడు.
పద ఘట్టనలతోనే :
అయితే మృత్యువు ఊరుకుంటుందా. అసలు దానికి రాజీ అన్నదే లేదు. అది తన విశ్వ రూపాన్ని అను నిత్యం చూపిస్తూనే ఉంటుంది. కాలాన్ని మొత్తంగా కమ్మేసిని మృత్యువు ఎపుడు ఎక్కడ వీలు అయితే అక్కడితో కాలానికి కోత వేసి తన వెంట తీసుకునిపోతుంది. మనిషి ఎంతగా తనను వద్దు అనుకుంటాడో తానూ అంతే పంతంగా అతడి దరి చేరడానికి మృత్యువు చూస్తూ ఉంటుంది. అయితే అంతా ఒక పద్ధతిగానే సర్వ సాధారణంగానే జరిగిపోతుంది. మరి మృత్యువు ఎక్కడ అని ప్రశ్నించాలనుకున్నా అది లేదని తన దరికి రాదని భావించినా అంతకు అంత తన ఉనికిని బలంగా చాటుకుంటూనే ఉంటుంది. తన పద ఘట్టనలలో విరుచుకుపడుతూనే ఉంటుంది.
అయిన వాళ్ళు కాని వాళ్ళు :
అది మనిషి లెక్కలోని మాటలు, తనకు దగ్గరి వారు అయినా పడని వారు అయినా మృత్యువుకు ఒక్కటే లెక్క. ఎవరిని వదలకుండా తీసుకుని పోతూనే ఉంటుంది. ఆ పక్కన ఈ పక్కన చప్పుడు చేస్తూ వస్తున్న మృత్యువు సడిని చూసినప్పుడైనా మనిషి అదే నిజమని కాసేపు నమ్మినా మళ్ళీ తనదైన భ్రాంతిలో మునిగిపోతాడు. మృత్యువు ఏంటి తన దగ్గరకు రావడమేంటి అది అసలు కుదిరే పని కాదు అని అనుకుంటాడు, ధీమా పడతాడు, తానే శాశ్వతం అనుకుంటాడు, మరి ఇంతకీ తన పక్కన ఉన్న వారు సన్నిహితులు అంతా ఎందుకు చనిపోతున్నరు అంటే అది వారి ప్రారబ్దం అనుకుంటాడు, అయ్యో పాపం అని సరిపెట్టుకుంటాడు, తాను మాత్రం అలాంటి కేటగిరీ కాదని తెగ నిబ్బరం ప్రదర్శిస్తాడు.
అందుకే అంటాడు ఆత్రేయ :
ప్రఖ్యాత సినీ కవి ఆచార్య ఆత్రేయ అందుకే అంటాడు, మృత్యువుకు నాకు లడాయి అని. అది నేనున్నపుడు నా దగ్గరకు రాదు, తీరా అది వస్తే నేను ఉండనుగా అంటాడు. ఇది ఒక దోబూచులాటగా ఆయన చెప్పినా అదే జీవిత సత్యం, వెలుగు నీడలుగా పగలు రాత్రిలా జీవితం పక్కనే మృత్యువు పొంచి ఉంటుంది. కానీ దానిని ఎంతగానైనా మరచిపోవాలని ప్రయత్నించడమే మనిషి జీవితం అంతా సాగుతుంది. మరి ఇంతకీ మృత్యువు ఎక్కడ అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు, అది తన రెక్కల చప్పుడు చేస్తూనే ఉంటోంది. అన్ని చోట్లా తాను ఉన్నాను అంటుంది. అన్ని వైపులా కనిపిస్తున్నా వినిపిస్తున్నా గుర్తించకపోవడమే మనిషి నైజం. అదే బలహీనత అని కూడా అనుకోవాలి.
మరణం అన్నది మాత్రం నిజం :
మనిషి భయం నుంచే బలహీనత కూడా వస్తుంది, అంటే తెలిసిన శత్రువుని ఉనికిలో ఉన్న బలవంతుడిని చూసీ చూడనట్లుగా నటిస్తూ సాగించే మనిషి జీవితం మొత్తం భ్రమలతో నిండి ఉంటే ఏదో నాటికి ఆ భ్రమలను తొలగించాలన్నదే మృత్యువు మొక్కవోని ఆలోచన. ఇది పరుగు పందెంగా భావించినా లేక దాగుడు మూతలాట అనుకున్నా ఒక్కటి మాత్రం నిజం. మనిషి వెంటే ఉంటుంది మృత్యువు, అది అంటిపెట్టుకునే జీవిత పర్యంతం సాగుతూంటుంది. అనుభవం లోకి వచ్చేసరికి మాత్రం ఆ మనిషి ఉండడు, అదే అందమైన మ్యాజిక్. అందుకే మృత్యువు విషయంలో తన దరికి రాదని మనిషి అనుకున్నా ఆ భ్రమలలోనూ ఎంతో కొంత నిజం ఉంది అనుకోవాలేమో. ఈ తమాషాలోనూ ఒక వింతైన వేధింపు ఉందేమో అని కూడా భావించాలేమో. మరణం అన్నది మాత్రం నిజం అనుకుంటే మాత్రం అందులో స్వాంతన ఎంతో ఉంటుంది అన్నదే అసలైన వేదాంతం. కానీ అది ఒంటబట్టడమే ఎవరికైనా బహు కష్టం.
