Begin typing your search above and press return to search.

ముందుంది అసలైన పెట్రో మంట.. లీటరుకు రూ. 28 నుంచి రూ. 33 వడ్డిస్తారా?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

By:  Tupaki Political Desk   |   26 May 2026 8:00 PM IST
ముందుంది అసలైన పెట్రో మంట.. లీటరుకు రూ. 28 నుంచి రూ. 33 వడ్డిస్తారా?
X

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే లీటరుపై దాదాపు రూ.8 వరకు ధరలు పెరిగినప్పటికీ, ముడిచమురు సంక్షోభం సృష్టించిన నష్టాల నుంచి ఆయిల్ కంపెనీలు ఇంకా పూర్తిగా కోలుకోలేదని అంటున్నారు. దీంతో ధరలు మరింత పెంచాలని చమురు కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చమురు సంస్థలు నష్టాల నుంచి గట్టెక్కాలంటే రానున్న రోజుల్లో ఇంధన ధరలను మరింత పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేంద్రం పెట్రోల్ ధరల పెంపును రోజువారీ ఎపిసోడ్ గా మార్చేస్తుందా? అన్న భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.28 నుంచి రూ.33 వరకు పెరిగితేనే రికవరీ?

గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టపోయాయని చెబుతున్నారు. ఈ నష్టాలను పూర్తిగా భర్తీ చేసుకుని, సాధారణ స్థితికి రావాలంటే లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై మరో రూ.28 నుంచి రూ.33 వరకు ధరలను పెంచాల్సి ఉంటుందని చమురు సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా సుమారు 8 రూపాయలను ప్రభుత్వం పెంచింది. ఈ ధర మరింత పెరిగితే అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.

20 రూపాయలు పెరిగే చాన్స్?

ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, విశ్లేషకుల అంచనాల ప్రకారం, లీటరుపై మరో రూ.20 పెరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే ఒకేసారి రూ.20 నుండి రూ.30 వరకు పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్రం భావిస్తోందని అంటున్నారు. సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి ఉన్నందున ధరల పెంపు ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రోజువారీ లేదా వారపు ధరల సవరణల విధానం తీసుకువచ్చి రేట్లను పెంచే వ్యూహాన్ని అవలంబించవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు మరో రూ.20 వరకు పెరిగితే, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయిల్ కంపెనీల నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం లేదా సబ్సిడీల రూపంలో ఊరటనివ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.