పాకిస్తాన్ లో రూ.80కి తగ్గిన లీటర్ పెట్రోల్ ధర..కారణం ఏంటంటే?
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అత్యవసరంగా సమావేశం నిర్వహించి ఇంధన ధరలను తగ్గించే నిర్ణయం తీసుకున్నారు.
By: A.N.Kumar | 4 April 2026 6:00 PM ISTపాకిస్థాన్‌లో పెట్రోల్ ధరల పెరుగుదలపై తీవ్ర ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది వారాలుగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం.. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల పాకిస్థాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఈ ప్రభావంతో లీటర్ పెట్రోల్ ధర ఒక దశలో 458 పాకిస్థాన్ రూపాయలకు చేరుకోగా హైస్పీడ్ డీజిల్ ధర 520 పాకిస్థాన్ రూపాయలకు చేరింది. ఇది సామాన్య ప్రజలపై భారీ భారం మోపింది.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదల ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. రవాణా ఖర్చులు భారీగా పెరగడంతో పాటు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయాయి. దీనితో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అత్యవసరంగా సమావేశం నిర్వహించి ఇంధన ధరలను తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు లీటర్ పెట్రోల్ ను 80 పాకిస్థాన్ రూపాయలకు ప్రకటించారు. ఈ నిర్ణయంతో కొత్తగా పెట్రోల్ ధర గణనీయంగా తగ్గింది. రాత్రికి రాత్రే ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం, అప్పులు పెరగడం వంటి సమస్యలు పాకిస్థాన్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాకుండా ఇంధన ధరల తగ్గింపు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఇంధన ధరల తగ్గింపుతో కొంతమేర ప్రజలు ఊపిరి పీల్చుకున్నప్పటికీ దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రభుత్వం స్థిరమైన ఆర్థిక విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల మార్పులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఇది పెద్ద సవాల్‌గా మారింది.
మొత్తంగా పెట్రోల్ ధరను ఒక్కసారిగా 80 రూపాయలు తగ్గించడం ద్వారా ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని కొంతవరకు చల్లార్చినప్పటికీ దేశ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
