Begin typing your search above and press return to search.

ముందు ఇంటిని చక్కబెట్టుకోండి... పాక్ కు ఇచ్చిపడేసిన ఇండియా!

ఈ మేరకు భారత దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ పాకిస్థాన్‌ ను గట్టిగా నిందించారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 5:36 AM GMT
ముందు ఇంటిని చక్కబెట్టుకోండి... పాక్  కు ఇచ్చిపడేసిన ఇండియా!
X

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్‌ పై నిరాధారమైన, దురుద్దేశపూరితమైన ప్రచారం చేసింది పాకిస్థాన్. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీంతో భారత్ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ధీటుగా బదులిచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ నిలయంగా మారిందని దుయ్యబట్టింది.

అవును... ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్‌ పై దురుద్దేశపూరితంగా చేసిన ప్రచారం, వేసిన నిరాధారమైన నిందలపై భారత్ ధీటుగా బదులిచ్చింది. ఈ మేరకు భారత దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ పాకిస్థాన్‌ ను గట్టిగా నిందించారు. ఇందులో భాగంగా... కశ్మీర్, మైనారిటీ హక్కులపై పాకిస్థాన్ వంచనను భారత్ తప్పుబట్టింది.

ఇదే సమయంలో జమ్మూకశ్మీర్‌ లో పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని కోరిన భారత్... 2011 ముంబై ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని పాకిస్థాన్‌ ను కోరింది. ఈ క్రమంలో పెటల్ గెహ్లాట్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా పాక్ పై విరుచుకుపడ్డారు.

ఇందులో భాగంగా అంతర్జాతీయంగా నిషేధిత అతిపెద్ద ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ నిలయంగా మారిందని, పాకిస్థాన్‌ లో మైనారిటీలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలని, భారతదేశం ఆక్రమిత ప్రాంతాలను పాకిస్థాన్ ఖాళీ చేయాలని గెహ్లాట్ కోరారు.

ఇదే సమయంలో... జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని.. భారతదేశ సొంత విషయాలకు సంబంధించి ప్రకటనలు చేయడానికి పాకిస్థాన్‌ కు ఎలాంటి హక్కు లేదని భారత దౌత్యవేత్త పునరుద్ఘాటించారు.

అదేవిధంగా... పాకిస్థాన్‌ లో క్రైస్తవులపై జరుగుతున్న హింసను ఎత్తిచూపుతూ... చర్చిలు, క్రైస్తవుల ఇళ్లను తగులబెట్టిన జరన్‌ వాలా ఘటనపై ఆమె మాట్లాడారు. మైనారిటీ వర్గాలకు చెందిన సుమారు 1000 మంది మహిళలు అపహరించారాని అన్నారు. వారితో బలవంతపు మతమార్పిడులకు, వివాహాలకు పాల్పడ్డారని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ ప్రచురించిన నివేదికను గహ్లోట్ ఈ సందర్భంగా ప్రస్థావించారు.

కాగా... ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆ దేశ తాత్కాలిక ప్రధాని అన్వారుల్ హక్ కాకర్ తన ప్రసంగంలో కశ్మీర్ గురించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో భారత దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్... పాకిస్థాన్ కు ఈ విధంగా ఇచ్చిపడేశారు!