Begin typing your search above and press return to search.

వైరల్ గా మారిన పేర్ని నాని ఆడియో క్లిప్ లో ఏముంది?

ఎన్నికల వేళ కావటం.. ఇప్పుడున్న టెక్నాలజీలో అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేసే టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   3 April 2024 4:35 AM GMT
వైరల్ గా మారిన పేర్ని నాని ఆడియో క్లిప్ లో ఏముంది?
X

ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయం మహా హాటుగా మారింది. బయట మంట పుట్టించే ఎండలతో హడలిపోతున్న ప్రజలకు అంతకు మించిన ట్విస్టులతో కూడిన రాజకీయం ఇప్పుడు వాతావరణాన్ని మరింత టెన్షన్ ను తీసుకొస్తోంది. ప్రత్యర్థి పార్టీలు.. వాటి నేతలకు సంబంధించిన ప్రతి అంశాన్ని రాజకీయం చేయటానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టటం లేదు. మరో నెలన్నరలో జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వేళ.. అధికార.. విపక్షాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

తమ చేతిలోని అధికార వ్యవస్థల్ని ఉపయోగించి ఎన్నికల్లో భారీ లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఏపీ అధికారపక్షం ఉందంటూ విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక అంశాన్ని హైలెట్ చేస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన ఒక ఆడియో క్లిప్ ను టీడీపీ వర్గాలు బయటపెట్టాయి. అందులో నిజం ఏంత? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఎన్నికల వేళ కావటం.. ఇప్పుడున్న టెక్నాలజీలో అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేసే టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకూ పేర్ని నాని పేరు మీద వైరల్ గా మారిన ఆడియో క్లిప్ లో ఏముంది? అన్నది చూస్తే.. వాలంటీర్ల ముచ్చటగా చెప్పాలి. వలంటీర్ల వ్యవస్థ లేకుంటే ఏదో జరిగిపోతుందని.. వైసీపీ పవర్ లోకి రాకుంటే ఈ వ్యవస్థ ఉండబోదన్న ప్రచారాన్ని చేసే అంశం ఇందులో ఉంది.

ఈసీ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ పథకాల్ని వాలంటీర్ల ద్వారా అమలు చేసే విధానానికి తాత్కాలికంగా చెక్ పడిన నేపథ్యంలో.. తాజా ఆంక్షలతో విసిగిన వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి అధికార పార్టీ తరఫున ఏ పనినైనా చేసేందుకు సిద్ధం కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పేర్ని నాని ఆడియోక్లిప్ లో.. ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు పెన్షన్ దారుల్ని ఆటోల్లో సచివాలయానికి తరలించాలని.. వారికి పెన్షన్లు ఇచ్చిన తర్వాత మళ్లీ వాళ్లు ఇంటికి వెళ్లేలా దింపాలన్న సూచన అందులో ఉంది. అంతేకాదు.. దానికి అయ్యే ఖర్చు లెక్క ముచ్చటను కూడా పేర్ని నాని చెప్పిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ వర్గాలు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.