పవన్ కి కనపడదు...వినపడదు !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పంచులు వేసేందుకు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఎపుడూ సిద్ధంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే.
By: Satya P | 17 Jun 2026 11:45 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పంచులు వేసేందుకు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఎపుడూ సిద్ధంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నపుడు దిగిపోయిన తరువాత కూడా పవన్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని పవన్ ని పట్టుకుని ఆయనకు కనబడదు వినబడదు అని పంచులు పేల్చారు. అన్నయ్యా అంటే మాత్రం అని దీర్ఘం తీస్తూ తెలంగాణాకు మాత్రం పరుగులు పెడతారు అని ముక్తాయించారు. ఇలా పవన్ ని తనదైన డైలాగులతో ఆడుకున్న పేర్ని నాని మీడియా మీట్ లో మరిన్ని సెటైర్లూ వేశారు.
ఆంధ్రాలో జనసైనికుల సంగతి :
ఏపీలో జనసైనికుల విషయంలో మాత్రం పవన్ కి అసలు పట్టింపు లేదని పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. వారికి ఏమి జరిగినా పవన్ కి కనిపించదు అని నాని అంటున్నారు. ఒక జనసైనికుడు గాదె సాయిక్రిష్ణని లాకప్ లో చంపేశారు కనీసం బూడిద అయినా ఇవ్వండిరా అని తల్లి ఏడుస్తూంటే మాత్రం పవన్ కి కనిపించదని వినిపించదని పేర్ని నాని వెటకరించారు. మా ఊళ్ళో ఇళ్ళు నేలమట్టం చేశారు అని అన్నా కనబడదు, వారి ఏడుపు వినబడదు అని ఆయన అన్నారు. తెలుగుదేశం వారు తమ ఆస్తులు లాక్కున్నారని గోడు పెట్టినా పవన్ కి ఏమీ కనబడదని నాని విమర్శించారు. అదే తెలంగాణాలో ఒక అభిమాని అంట ఒంట్లో బాలేదని అంటే వస్తున్నా తమ్ముడూ అని పవన్ వెళ్ళిపోతున్నారని నాని హాట్ కామెంట్స్ చేశారు. రాజా ది గ్రేట్ సినిమాలో ఏమో సర్ నాకు కనబడదు అన్న డైలాగులా తయారైంది జనసేనలో పరిస్థితి అని నాని సెటైర్లు వేశారు.
సాయి క్రిష్ణ కేసు లింక్ తో :
ఇదిలా ఉంటే విజయవాడ కృష్ణ లంకలో నివసించే సాయి క్రిష్ణ గత నెల 26 నుంచి కనిపించడం లేదని ఆయన తల్లి ఆవేదన చెందుతోందని జనసేన అభిమానిగా ఉన్న సాయి క్రిష్ణ సంగతి పట్టదా అని వైసీపీ పవన్ ని నేరుగా టార్గెట్ చేస్తోంది. అదే సమయంలో లాకప్ లో కొట్టి చంపేశారు అని అంబటి రాంబాబు లాంటి వారు విమర్శించారు. ఈ విషయం మీద జనసేన అధినేతగా పవన్ రియాక్ట్ కారా అని అంబటి రాంబాబు పేర్ని నాని లాంటి వారు నిలదీస్తున్నారు. ఒక విధంగా ఇరకాటంలో పెడుతున్నారు. ఇక ఈ ఇష్యూ మీద రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైసీపీ పిలుపు ఇచ్చిన నేపధ్యంలో జనసేనను టార్గెట్ చేయడం విశేషం. పవన్ కి ఏపీ కంటే తెలంగాణా ముఖ్యమని అలాగే ఇక్కడ జనసేన కార్యకర్తల కంటే అక్కడి అభిమానులే ఎక్కువని వైసీపీ నేతలు చెబుతూ ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు. ఇష్యూ సున్నితమైనది కావడంతో జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
