Begin typing your search above and press return to search.

మళ్లీ అజ్ఞాతంలోకి పేర్ని నాని.. ఈ సారి ఎందుకో తెలుసా?

‘‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’’ అన్న పేరుతో వైసీపీ ఇటీవల నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించింది.

By:  Tupaki Desk   |   21 July 2025 2:35 PM IST
మళ్లీ అజ్ఞాతంలోకి పేర్ని నాని.. ఈ సారి ఎందుకో తెలుసా?
X

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిలు లభించకపోవడంతో అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి పేర్ని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బందరు రాజకీయం మరో మారు వేడెక్కింది. ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని ముందస్తు బెయిల్ పై ఉన్నారు. ఇక తాజా కేసులో స్థానిక కోర్టు ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు.

‘‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’’ అన్న పేరుతో వైసీపీ ఇటీవల నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి పేర్ని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ‘రప్పా.. రప్పా.. నరుకుతాం’ పోస్టర్లు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీన్ని పామర్రు, అవనిగడ్డ సమావేశాల్లో ప్రస్తావించిన మాజీ మంత్రి పేర్ని.. ఇంకా ఎన్నాళ్లు ‘రప్పా.. రప్పా.. అంటారు. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాల్సిందే..’’ అంటూ వ్యాఖ్యానించారని కొన్ని వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికారమిస్తే ప్రజలను నరికేస్తారా? అంటూ ప్రశ్నించింది. అదే సమయంలో మాజీ మంత్రిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో అవనిగడ్డ పోలీసుస్టేషన్లలో పేర్నిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టం 353(2), 196(1) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం మాజీ మంత్రి పేర్ని మచిలీపట్నం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో మాజీ మంత్రి బెయిలు కోసం హైకోర్టులో అప్పీలు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ లోగా పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో మాజీ మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కూటమి అధికారంలోకి వచ్చాక పేర్ని నానిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో బందరులో ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రేషన్ గోడౌనులో బియ్యం అక్రమంగా తరలించారని గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో పేర్ని నాని భార్య జయప్రద ఏ1 నిందితురాలు కాగా, పేర్ని నానిని ఏ6గా చేర్చారు. అయితే బియ్యం విలువ మేరకు సుమారు రూ.1.70 కోట్ల డబ్బు తిరిగి చెల్లించడంతో ఆ కేసులో ఇద్దరికి ముందస్తు బెయిలు మంజూరైందని అంటున్నారు. ఈ కేసులో అప్పట్లో కొన్ని రోజులు మాజీ మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లారు. బెయిలు మంజూరైన తర్వాతే బయటకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగించారు. ఇక తాజాగా నమోదైన కేసులో ఆయన మరోమారు అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు.