మరీ ఇలా బుక్ అయిపోతే ఎలా పేర్ని నాని?
తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడన్న పాత సామెతను వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని మర్చిపోతున్నారు
By: Tupaki Desk | 13 July 2025 10:32 AM ISTతాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడన్న పాత సామెతను వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని మర్చిపోతున్నారు. చేసేది తప్పుడు పనైనప్పుడు కాసిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న చిన్న విషయాన్ని ఎలా మిస్ అయ్యారన్నది ఇప్పుడు చర్చగా మారింది. తాజాగా ఆయన చేసిన పొలిటికల్ ప్లానింగ్ కాస్తా బయటకు పొక్కటం.. అడ్డంగా బుక్ కావటంతో ఆయన ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. నోటికి అదే పనిగా పని చెప్పే పేర్ని నాని.. తాజాగా ఫిక్స్ అయిన వైనం ఆయనకు పెద్ద దెబ్బగా చెబుతున్నారు. గుడివాడలో జరిగిన గొడవను ఎలా మార్చాలన్న విషయాన్ని ఫోన్లో వివరిస్తున్న ఆడియో బయటకు పొక్కటంతో హమ్మ.. పేర్నినాని.. మీ ప్లానింగ్ ఇంత క్రూరంగా ఉంటుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
గుడివాడ జెడ్పీ ఛైర్ పర్సన్ కారుపై జరిగిన దాడి ఘటనను.. రాజకీయ గొడవగా కాకుండా.. ఒక బీసీ మహిళపై జరిగిన దాడిగా పేర్కొంటూ మనోళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా కలిసి గొడవ చేయాలంటూ పేర్నినాని చేసిన ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. ‘బీసీ గౌడ మహిళ అని అందరూ బయటకు వచ్చి చెప్పాలి. పై నుంచి లోకేశ్ చెప్పటంతో గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే.. అతని అనుచరులు దాడి చేశారని ప్రచారం చేద్దాం. మన వాళ్లందరికి మన నాయకుడితో చెప్పిస్తేనే అందరూ గట్టిగా చేస్తారు. మన నాయకుడు చెబితేనే వింటారు. రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా కులం పేరుతో ఆందోళనలు చేద్దాం’ అంటూ పేర్ని నాని దుర్మార్గమైన ప్లానింగ్ కు సంబంధించిన కాల్ వీడియో బయటకు వచ్చింది.
దీంతో పేర్ని నాని ప్లానింగ్ ఎలా ఉంటుందన్న విషయం అందరికి అర్థమయ్యేలా చేసింది. ఇలాంటి ముదురు తెలివితేటల్ని ప్రదర్శించే వేళలో కాసింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది కదా? అన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే తన నోటి మాటలతో పార్టీని ఇబ్బంది పెట్టే పేర్ని నాని.. తాజాగా బయటకు వచ్చిన కాల్ వీడియో పార్టీని ఇరుకున పడేసేలా చేసిందన్న వాదన వినిపిస్తోంది. అధికార పార్టీని ఇరుకున పడేయాలన్న పేర్ని నాని.. చివరకు తనకు తానే అడ్డంగా బుక్ కావటం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనేం చెబుతారు? బయటకువచ్చిన వీడియో కాల్ క్లిప్ కు ఎలాంటి భాష్యాన్ని ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
