గుడివాడలో హైటెన్షన్.. పేర్ని నాని హౌస్ అరెస్టు
మరోవైపు.. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ నడిచింది. గుడివాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు.. రప్పారప్పా.. నరుకుతాం.. అంటూ పెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేశారు
By: Tupaki Desk | 12 July 2025 8:16 PM ISTవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు.. ఇతర నాయకులను కూ డా ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో కృష్ణాజిల్లాలోని కీలక నియోజకవర్గం గుడివాడలో హైటెన్షన్ నెలకొం ది. శనివారం సాయంత్రం గుడివాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో పేర్ని భేటీ కావాల్సి ఉంది. అయితే.. శుక్రవారం ఆయన పార్టీ నాయకులను ఉద్దేశించి చేసిన `రప్పా-రప్పా` వ్యాఖ్యలతో గుడివాడకు నానీ వస్తే.. అడ్డుకునితీరుతామని టీడీపీకార్యకర్తలు, నాయకులు హెచ్చరించారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారి.. ఏదైనా జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందుగా నానీని రాకుండా నోటీసులు ఇచ్చారు. అయితే.. ఆయన పట్టుదలగా ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీంతో మచిలీపట్నంలోని ఇంట్లోనే ఆయనను నిర్బంధించారు. మరోవైపు గుడివాడ జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ విస్తృత సమావేశానికి వెళ్తుండగా హారిక కారుపై దాడి చేసినట్టు చెబుతు న్నారు. సమావేశానికి వెళ్లకుండా కర్రలు, రాళ్లతో దాడిచేసి అడ్డుకున్నారని, తమపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకో లేదని ఆరోపించారు.
ఫ్లెక్సీ వార్..
మరోవైపు.. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ నడిచింది. గుడివాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు.. రప్పారప్పా.. నరుకుతాం.. అంటూ పెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేశారు బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీని పోలీసులు తొలగించారు. అయితే.. టీడీపీ కార్యకర్తలు.. ఇదేసెంటర్‌లో మరో పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ``వచ్చే ఎన్నికల్లో(2024) కుప్పంలో చంద్రబాబును ఓడించకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుని.. ఆయన బూట్లు పాలిష్ చేస్తా`` అని గతంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ.. దమ్ముంటే గుడివాడకు రా! అని టీడీపీకార్యకర్తలు దీనిని ఏర్పాటు చేశారు. అయితే.. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించి.. టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అలానే ఉంచారంటూ.. వైసీపీ నాయకులు పోలీసులపై వాగ్వాదానికి దిగారు. మొత్తంగా.. గుడివాడలో హైటెన్షన్ నెలకొంది.
