Begin typing your search above and press return to search.

పవర్ లేకున్నా మాట తీరు మారని పేర్ని నాని

ఈ సందర్భంగా మాజీ మంత్రి.. వైసీపీ నేత పేర్ని నాని.. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులుకలిసి తమ అనుచరులతో కలిసి ఆసుపత్రి వద్దకు వచ్చారు.

By:  Tupaki Desk   |   25 May 2025 9:55 AM IST
పవర్ లేకున్నా మాట తీరు మారని పేర్ని నాని
X

నోటికి వచ్చినట్లుగా మాట్లాడే నేతలు కొందరు కనిపిస్తారు. ఇలాంటోళ్లకు మీడియాను కలిసిన సందర్భంగా ఎంతలా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జాబితాలో అందరికంటే ముందు ఉండే వైసీపీనేతల్లో పేర్ని నాని ఒకరు. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం.. మాట్లాడే మాట ముందు వెనుకా లేకుండా అనేయటం ఆయనకు అలవాటు. తాజాగా అలాంటి తీరునే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కం మత్తు డాక్టర్ (అనస్థీషియన్) మీదా ప్రదర్శించారు.

వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు ఆరోగ్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి.. వైసీపీ నేత పేర్ని నాని.. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులుకలిసి తమ అనుచరులతో కలిసి ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన వంశీని కలిసేందుకు తమను అనుమతించాలని వీరంగం వేశారు. నిబందనల ప్రకారం అలాంటివి సాధ్యం కాదన్న అధికారులపై విరుచుకుపడ్డారు.

మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. పేర్ని నాని మాత్రం నోటికి అదే పనిగా పని చెప్పారు. ‘ఈ మత్తోడు.. ఆసుపత్రిలో ఉద్యోగానికి వచ్చినప్పటి నుంచి విజయవాడలోనే ఉంటున్నాడంట. అంటే.. ఎంతమందికి చెంచాగిరీ చేస్తే.. ఇన్నాళ్లు ఇక్కడున్నాడో? చంద్రబాబు లోకేశ్ లకు అతడు చెంచాగిరి చేస్తున్నాడు. ఈ మత్తోడు ఇంతకింతా అనుభవించే రోజు వచ్చి తీరుతుంది’ అంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై రెచ్చిపోయారు.

ఆసుపత్రి లోపలకు వెళ్లేందుకు అనుమతి లేదని ఎంత చెప్పినా.. వినకుండా అక్కడి సిబ్బందిని నెట్టుకుంటూ లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు పేర్ని నాని అండ్ కో. జ్యూడిషయల్ కస్టడీలో ఉన్న వంశీని కలిసే ప్రయత్నం చేయటంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. వారిని బలవంతంగా బయటకు పంపటంతో పరిస్థితి నార్మల్ కు వచ్చింది.

అయితే.. తమను వెనక్కి పంపటాన్ని సీరియస్ గా తీసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం సంచలనంగా మారింది. అదే సమయంలో వైద్య సంఘాల ప్రతినిధులు పేర్ని నాని వ్యాఖ్యల్ని ఖండించటమే కాదు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వేళ చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవర్ ఉన్నా.. లేకున్నా.. తన నోటికి అడ్డే లేదన్న విషయాన్ని పేర్ని నాని మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి.