ఆ రోజే మానసికంగా చచ్చా అంటూనే నోటికి పని చెప్పిన పేర్ని
నోటికి వచ్చినట్లు మాట్లాడే వైసీపీ నేతలు కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారు. మాట్లాడే మాటల్లో తీవ్రత ఉండాలే తప్పించి తిట్లు ఉండకూడదు.
By: Tupaki Desk | 13 Jun 2025 9:36 AM ISTనోటికి వచ్చినట్లు మాట్లాడే వైసీపీ నేతలు కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారు. మాట్లాడే మాటల్లో తీవ్రత ఉండాలే తప్పించి తిట్లు ఉండకూడదు. అధికారంలో ఉన్న వారి మీద విమర్శలు చేయటం తప్పేం కాదు. ఆ విమర్శలన్నీ కూడా అధికారపక్షాన్ని.. నేతల్ని ఇరుకున పెట్టేలా ఉండాలే తప్పించి.. అహంకారంతో మాట్లాడినట్లుగా ఉండకూడదు. గడిచిన పదేళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చాలానే మార్పులు చెందాయి. ఇలాంటి వేళ.. ఎలా వ్యవహరించాలి? ప్రజా బలాన్ని ఎలా సొంతం చేసుకోవాలన్న లెక్కలు చాలా త్వరగా మారిపోతున్నాయి.
ప్రజామోదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై మొదటి రెండు.. మూడేళ్లు ప్రజల్లో అంతో ఇంతో సానుకూలత ఉంటుంది.ఇలాంటి వేళ.. సమయం కోసం ఎదురుచూడటం.. ప్రజాసమస్యల్ని అందిపుచ్చుకొని వారి తరఫున పోరాడటం చేయాలి. కానీ.. వైసీపీ నేతలు ప్రజల తరఫు కంటే కూడా తమ కోసం తామే పోరాడుతున్న వైఖరి ప్రజల్లో వారిని పలుచన చేస్తోంది. తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో తమ పాలనా తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని వారు మర్చిపోవటం.. తాము చేసిన తప్పులను ఒప్పుకోవటం మంచిది.
కానీ.. అలాంటిదేమీ లేకుండా.. తమ తప్పుల్ని చూపినోళ్లపై విరుచుకుపడటం.. నోటికి పని చెప్పటం.. మళ్లీ అధికారంలోకి వచ్చినంతనే మీ సంగతి చూస్తాననటం లాంటి వాటితో మరింత డ్యామేజ్ అవుతారన్నది మర్చిపోకూడదు. మాజీమంత్రి పేర్ని నాని సంగతే తీసుకుంటే.. మంత్రిగా ఉన్న వేళలో ఆయన మాటలు ఎలా ఉండేవో అందరికి తెలిసిందే. అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన వ్యవహరించేవారు. రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా మాటలు తూటాల మాదిరి విసిరేవారు.
తరచూ నీతులు చెప్పే ఆయన.. కూటమి ప్రభుత్వంలో రేషన్ బియ్యం కేసు తెర మీదకు వచ్చిన తర్వాత ఆయన ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయ్యింది. అన్నింటికి మించిన తన భార్య పేరు మీద జరిగే దందాకు సంబంధించిన అంశాల్లో సమాధానం చెప్పలేని పరిస్థితికి చేరుకున్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయారు. తాజాగా ఆ కేసుకు సంబంధించి మళ్లీ అరెస్టు అవుతారన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయన మళ్లీ నోటికి పని చెప్పారు.
రేషన్ బియ్యం కేసులో నా భార్యను తీసుకొని పదిహేను రోజులు రోజుకొక చోట దాక్కుంటూ తిరిగానని.. ఆ రోజే తాను మానసింకగా చచ్చిపోయినట్లుగా పేర్కొన్నారు. లక్కీగా బెయిల్ వచ్చిందని.. అయినా వదలకుండా తన భార్యను విచారించిన వైనాన్ని విరుచుకుపడ్డారు. ఒక నేరారోపణ వచ్చినప్పుడు.. అందులో నిజం లేదన్న విషయాన్ని ఆధారాలతో సహా తెర మీదకు తీసుకొస్తే.. ప్రభుత్వాలు సైతం ఇరుకున పడతాయి కదా?
తాను సుద్దపూసనని పేర్ని నాని బలంగా నమ్ముతున్నప్పుడు.. ఆ అంశాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తే.. కూటమి సర్కారు ఆయన్ను లక్ష్యంగా చేసుకుందన్న ఆయన వాదనను నమ్ముతారు. అదే జరిగితే.. రాజకీయంగా ఇబ్బందులు తర్వాత ప్రజాక్షేత్రంలో ఆయన బలాన్ని పెంచుకున్నట్లే అవుతుంది కదా? ఆ అంశాల్ని వదిలేసి.. తనను అరెస్టు చేస్తారన్న ప్రచారం వేళ.. పోలీసుల మీద నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
తాజాగా నకిలీ పట్టాల వివాదంలో తనను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న సందర్భంలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఎఫ్ఐఆర్ కట్టకుండా అరెస్టు చేసే ధైర్యం ఎవడికి ఉంది? వాళ్లు శునకానందం పొందటం తప్పించి అంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు ఆయనపై గౌరవాన్ని తగ్గిస్తాయే తప్పించి పెంచవు. దానికి బదులుగా.. తగిన ఆధారాలు చూపండి.. తప్పు చేసినట్లు నిరూపించండి.. ఏ శిక్షకైనా సిద్ధమని మాట్లాడితే ఎంత హుందాగా ఉంటుంది? నోరు పారేసుకుంటే మహా నాయకుడు అయిపోతారన్న భ్రమ నుంచి పేర్ని నాని ఎప్పుడు బయటకు వస్తారో?
