పేర్ని నానీకి అరెస్టు వారెంటు.. కేసు ఏంటంటే!
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానికి కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది.
By: Tupaki Desk | 16 Jun 2025 11:23 PM ISTవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానికి కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. ఆయనను అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు నానీపై అరెస్టు వారెంటును జారీ చేస్తూ.. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు నానీని అరెస్టు చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే.. ఇది నానీ కానీ, నానీ కుటుంబం కానీ చేసిన తప్పు కాదు. వారిపై నమోదైన కేసు విషయంలోనూ ఆయనను అరెస్టు చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు ఇవ్వలేదు. ఇది వేరే కేసు. అయితే.. ఆ కేసులో నానీ ప్రధాన సాక్షి.
2019లో వైసీపీ అధికారంలోకివచ్చిన తర్వాత.. టీడీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే నాని ఫిర్యాదు మేరకు చందు శ్రీహర్ష అనే వ్యక్తిపై పోలీసులు కేసునమోదు చేశారు. దీనికి సంబంధించిన ఛార్జిషీటును కూడా దాఖలు చేశారు. అయితే.. ఈ కేసు విచారణ సమయంలో సాక్ష్యం చెప్పేందుకు ఫిర్యాదు దారుగా ఉన్నపేర్ని నాని కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఆయన సాక్ష్యం చెప్పేందుకు నిరాకరిస్తూ.. గత ఆరు సంవత్సరాలుగా తప్పించుకుంటున్నారు. దీంతో చందు శ్రీహర్ష.. రివర్స్ కేసు పెట్టారు.
తనను ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారని తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే నానీ కొందరు కుట్ర పన్నారని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన మచిలీపట్నం కోర్టు.. నానీని విచారణకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుతూ.. నోటీసులు ఇచ్చింది. అయితే.. ఆయన ఎప్పటికీ రాకపోవడంతో నానీపై సీరియస్ అయిన మచిలీపట్నం కోర్టు.. తక్షణమే ఆయనను అరెస్టు చేసైనా సరే.. సాక్షిగా కోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సెప్టెంబరు 19కి వాయిదా వేసింది. ఈ లోగా ఆయనను అరెస్టు చేయాలని కోర్టు పేర్కొంది. దీంతో ఇప్పుడు నానీ చిక్కుల్లో పడినట్టు అయింది. మరి ఆయన ఈ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఏం చేస్తారో చూడాలి.
