Begin typing your search above and press return to search.

కాలంతో పనిలేదు ఫ్రీగా కావాల్సిందే.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యం!

సాధారణంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి కల్తీ ఆహారాన్ని సీజ్ చేసినప్పుడు వాటిని పూర్తిగా నాశనం చేయాలి. అంటే అవి ఇంకెవరికి అందకుండా చేయాలి.

By:  Madhu Reddy   |   28 Feb 2026 4:08 PM IST
కాలంతో పనిలేదు ఫ్రీగా కావాల్సిందే.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యం!
X

కొందరి ప్రవర్తన చాలా విచిత్రంగా వుంటుంది. ఉచితంగా వస్తే అది విషమని తెలిసినా వదలరా? అనే స్థాయిలో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యూపీలోని హాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి, కల్తీ మరియు ఎక్స్‌పైరీ అయిపోయిన స్వీట్లను చెత్తకుండీలో పడేశారు. అయితే, అవి ఆరోగ్యానికి ప్రమాదకరమని అధికారులు నెత్తీనోరు బాదుకున్నా వినకుండా, జనం ఆ చెత్తలో ఉన్న స్వీట్ బాక్సుల కోసం ఎగబడ్డారు. 'ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారా?' అన్నట్లుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తోంది.

చెత్తకుండీలో స్వీట్ల వేట.. అధికారులే షాక్:

హాపూర్‌లోని స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా నిల్వ ఉంచిన, నాణ్యత లేని స్వీట్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం వాటిని ధ్వంసం చేయాల్సి ఉండగా, అధికారులు వాటిని చెత్తకుండీలో పడేశారు. కానీ తరువాత ఏమి జరిగిందో తెలుసా.. అక్కడ ఉన్న జనం ఆ చెత్తలో పడి ఉన్న స్వీట్ బాక్సులను ఏరుకోవడానికి పోటీ పడ్డారు. అది ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ పదార్థాలని తెలిసినా, కేవలం ఉచితంగా దొరుకుతున్నాయనే ఆశతో వారు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు.

ఆరోగ్యం కంటే ఆశే ఎక్కువైందా?:

సాధారణంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి కల్తీ ఆహారాన్ని సీజ్ చేసినప్పుడు వాటిని పూర్తిగా నాశనం చేయాలి. అంటే అవి ఇంకెవరికి అందకుండా చేయాలి. కానీ ఇక్కడ జనం ఎంత వేగంగా స్పందించారంటే, అధికారులు అక్కడ నుంచి వెళ్ళేలోపే బాక్సులను ఎత్తుకెళ్లిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు "ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఫ్రీగా వస్తే ఏదైనా తినేస్తారా?" అంటూ మండిపడుతున్నారు. ఆ స్వీట్లు తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉందని తెలిసినా, ఆ కనీస స్పృహ లేకుండా ప్రవర్తించడం మన బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతోంది.

నిబంధనల అమలులో వైఫల్యం.. గుణపాఠం :

ఈ ఘటనలో అధికారుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. సీజ్ చేసిన కల్తీ ఆహారాన్ని ఎవరూ ముట్టుకోకుండా గుంత తీసి పాతిపెట్టడమో లేదా కాల్చివేయడమో చేయాల్సింది పోయి, ఇలా బహిరంగంగా చెత్తకుండీలో వేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అటు జనం ప్రాణాలకు తెగించి ఆశపడటం, ఇటు అధికారులు అరకొరగా పని ముగించడం.. వెరసి ఈ ఘటన ఒక పెను ముప్పుకు దారితీస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో జనం అవగాహన పెంచుకోకపోతే, ఉచితం అనే ఆశ ప్రాణాలకే ఎసరు పెడుతుందని ఈ దృశ్యం ద్వారా మనకు తెలుస్తుంది.